Elections 2023 : ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ఎవరికి కీలకం?

రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరాం. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు (Elections) ఎవరికి కీలకమైన అంశం అనేది ప్రధానంగా చర్చకు వస్తుంది.

  • Written By:
  • Updated On - October 10, 2023 / 02:29 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Elections 2023 : ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 17 నుంచి 30 వరకు ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. డిసెంబర్ 3 న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరాం – ఈ ఐదు రాష్ట్రాల్లో నవంబర్ లో ఎన్నికల ప్రక్రియ పూర్తికానున్న నేపథ్యంలో అనేక రకాల అంచనాలు ఊహాగానాలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికలను రానున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా అభివర్ణిస్తున్నారు. ప్రతిపక్షాల కూటమి (INDIA) వారు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశభవితవ్యాన్ని నిర్దేశించే కీలకమైన ఫలితాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

కాంగ్రెస్, మిగిలిన ప్రతిపక్షాలు దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వారు, బిజెపి మిత్ర పక్షాలు కూడా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను కీలకంగా భావిస్తున్నప్పటికీ వీటి ఫలితాలే రానున్న సార్వత్రిక ఎన్నికలలో జయపజయాలను నిర్దేశిస్తాయని మాత్రం చెప్పటం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు (Elections) ఎవరికి కీలకమైన అంశం అనేది ప్రధానంగా చర్చకు వస్తుంది.

ఎన్నికలు (Elections) ఇప్పుడు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో కేవలం మధ్యప్రదేశ్ లో మాత్రమే బిజెపి అధికారంలో ఉంది. అది కూడా అక్కడ ముందు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బిజెపి ఏర్పాటు చేసిన ప్రభుత్వం. వాస్తవానికి చెప్పాలంటే ఈ ఐదు రాష్ట్రాల్లో 2018 లో జరిగిన ఎన్నికల లో ఎక్కడా బిజెపి గెలవలేదు. ఇలా చూస్తే ఇప్పుడు బిజెపి ఏ రాష్ట్రంలో విజయం సాధించినా, అది బిజెపికి ప్లస్ పాయింట్ గానే అవుతుంది. 15 ఏళ్లు నిరాటంకంగా బిజెపి పరిపాలించిన చత్తీస్ గఢ్ లో 2018లో ఓటమిపాలైంది. అక్కడ ఎలాగైనా తిరిగి పాగా వేయాలని ఆ రాష్ట్ర ఎన్నికలను బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పావులు కదుపుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

మధ్యప్రదేశ్ లో గతంలో ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, ఇప్పుడు సొంత బలంతో అక్కడ గెలుపొంది, బిజెపి ఆ రాష్ట్రంలో తన ఉనికిని, తన శక్తిని చాటుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పట్ల, ఆయన ప్రభుత్వం పట్ల వ్యక్తం అవుతున్న వ్యతిరేకతను ఎదుర్కోవడానికి బిజెపి, ముగ్గురు కేంద్ర మంత్రులను, నలుగురు పార్టీ లోక్సభ సభ్యులను అభ్యర్థులుగా రంగంలోకి దించింది. దీన్నిబట్టి మధ్యప్రదేశ్ లో అధికార బిజెపిలో ఉన్న అసంతృప్తులను, ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తులను అన్నింటిని అధిగమించడానికి కేంద్రం నుంచి అభ్యర్థులను బిజెపి రాష్ట్రానికి తీసుకువస్తున్న సంకేతాలను ఇస్తుంది.

రాజస్థాన్ లో కూడా బిజెపి ఆరుగురు లోక్ సభ సభ్యులను, ఒక రాజ్యసభ సభ్యురాలిని రంగంలోకి దింపింది. కేంద్రం నుంచి రాష్ట్రాల ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులను రంగంలోకి దింపడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో పార్టీ నాయకత్వంలో ఉన్న బలహీనతను తెలియజేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బిజెపి తీసుకున్న ఈ నిర్ణయం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Also Read:  KA Paul : తెలంగాణలో అధికారం చేపట్టేది మీమే అంటున్న KA పాల్

మిజోరంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ కి, జడ్.పి.ఎం కి మధ్య పోటీ ఉంటుంది తప్ప అక్కడ జాతీయ పార్టీల ప్రాబల్యం ఏమీ లేదు. కనుక అక్కడ కాంగ్రెస్, బిజెపి లు కోల్పోయేది, గెలుచుకునేది పెద్దగా ఏమీ లేదు. ఇక తెలంగాణలో మాత్రం బిజెపి, కాంగ్రెస్, అధికార బీఆర్ఎస్ మధ్య పోటీ జరుగుతుంది. ఇక్కడ అధికారం కోసం కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా బీఆర్ఎస్ తో తలపడుతుంది. ఒకప్పుడు తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా తమ పార్టీ ముందుకు వెళుతుందని గొప్పలు చెప్పుకున్న బిజెపి పార్టీ, ఎప్పుడు రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ రావొచ్చని ఊహాగానాలను ప్రచారం చేస్తోంది. దీని ద్వారా తెలంగాణలో బిజెపి మూడో స్థానంలోకి వెళ్లిపోయిందని రాజకీయ విశ్లేషకులు బాహాటంగానే చెబుతున్నారు.

ఇలా ఐదు రాష్ట్రాల్లో చూసుకుంటే వాస్తవానికి గెలుపు అధికారంలో ఉన్న పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం. దేశవ్యాప్త రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటే, ప్రతిపక్షంలో ప్రధానంగా ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కీలకం కాబోతున్న తరుణంలో, దాన్ని ఏమాత్రం అడ్డుకున్నా, అది బిజెపి విజయం కిందే వస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ లలో విజయం ఎంత కీలకమో, అక్కడ కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించడం కూడా బిజెపికి అంతే కీలకం.

అసలే బీహార్ లో చెలరేగిన కుల గణన తుఫాన్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ దేశమంతా క్యాస్ట్ సర్వే కోసం డిమాండ్ చేస్తుంది. ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా క్యాస్ట్ సర్వే అనేది ఒక కీలకమైన అంశంగా మారిపోతుంది. అందుకే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు (Elections) బిజెపికి, కాంగ్రెస్ కి కూడా అతి కేలకమే.

Also Read: Chandrababu Neeru Chettu Scheme : ‘నీరు-చెట్టు’ కార్యక్రమంలో వేలకోట్లు చేతులు మారాయంటూ వైసీపీ ఆరోపణ