DY Chandrachud : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2022 నవంబరు 9న బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ పదవీ కాలం ఈరోజు(ఆదివారం)తో ముగియనుంది. ఆయన స్థానంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబర్ 11న(సోమవారం) సీజేఐగా పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. సంచలన, చారిత్రాత్మక తీర్పులకు మారుపేరుగా నిలిచిన జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ విరమణ తర్వాత ఏం చేయబోతున్నారు ? ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి ? అనే దానిపై అందరికీ ఆసక్తి నెలకొంది.
‘‘సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా(DY Chandrachud) రిటైర్ అయ్యే వారికి ప్రభుత్వం చాలా రకాల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన పార్లమెంటరీ నిబంధనలు కూడా ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ కన్జూమర్ డిస్‌ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్, టెలికాం డిస్‌ప్యూట్స్ ట్రిబ్యునల్ వంటివి పార్లమెంటరీ చట్టాలకు లోబడి పనిచేస్తుంటాయి. వీటిలో రిటైర్డ్ సీజేఐలకు, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు అవకాశం ఇస్తుంటారు’’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్ వివరించారు. దీంతో తదుపరిగా ఆయనకు ఇలాంటి ఏదైనా కీలక ట్రిబ్యునల్‌లో ముఖ్య పదవి దక్కబోతోందా అనే అంచనాలు వెలువడుతున్నాయి. ‘‘ఇలాంటి ట్రిబ్యునల్స్ అత్యంత కీలకమైనవి. వాటి ఎదుటకు వచ్చే అంశాలు చాలా సున్నితమైనవి, ప్రాధాన్యం కలిగినవి. అందుకే వాటిలో కీలక హోదాల్లో ఉండటం అనేది సవాళ్లతో కూడుకున్న అంశం. వాటికి పరిష్కారాన్ని సూచించాలంటే.. సుదీర్ఘ అనుభవం, ప్రొఫెషనల్ పరమైన సమగ్రత, చట్టాలపై లోతైన అవగాహన అవసరం. అందుకే సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన రిటైర్డ్ న్యాయమూర్తులను ఈ ట్రిబ్యునల్స్‌లో అపాయింట్ చేస్తుంటారు’’ అని చంద్రచూడ్ వివరించారు.
Also Read :Group 3 : తెలంగాణ గ్రూప్ – 3 పరీక్షల హాల్ టికెట్లు విడుదల
సీజేఐ డీవై చంద్రచూడ్ చివరి వర్కింగ్ డే నవంబర్ 8. ఆ రోజున ఆయన ప్రసంగిస్తూ.. ‘‘నేను ఎవరినైనా బాధపెట్టినట్లయితే క్షమించండి’’ అని కోరారు. తనకు సహకరించిన సుప్రీంకోర్టు న్యాయవాదులు, సుప్రీంకోర్టు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రచూడ్ 2016 మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 నవంబర్‌లో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.