Site icon HashtagU Telugu

Mahadev Betting App : ‘మహాదేవ్ బెట్టింగ్ యాప్’ ఓనర్ అరెస్ట్.. ఎక్కడ.. ఎలా ?

Mahadev Betting App

Mahadev Betting App

Mahadev Betting App : మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ వ్యవహారం యావత్ దేశంలో కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేరుగా మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరోపణలు చేయడం సంచలనం క్రియేట్ చేసింది. ఈ కేసుపై సీరియస్‌గా ఫోకస్ పెట్టిన ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక పురోగతిని సాధించింది. ఈడీ అభ్యర్థనతో ఇంటర్‌ పోల్‌ జారీ చేసిన రెడ్‌ కార్నర్‌ నోటీసు ఆధారంగా దుబాయ్ పోలీసులు.. అక్కడ ఉంటున్న మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఓనర్లలో ఒకరైన రవి ఉప్పల్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. గతవారమే అతడిని అదుపులోకి తీసుకోగా.. ఆ విషయం తాజాగా బుధవారం వెలుగుచూసింది. రవి ఉప్పల్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు దుబాయ్ అధికారులతో ఈడీ సంప్రదింపులు జరుపుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

సౌరభ్‌ చంద్రకర్‌, రవి ఉప్పల్‌.. మహాదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌‌లో(Mahadev Betting App) ప్రమోటర్లుగా ఉన్నారు.  వీరు భారత్‌లో 4వేల మంది ఆపరేటర్లను నియమించుకున్నారు. ఒక్కో ఆపరేటర్‌కు సుమారు 200 మంది కస్టమర్లున్నారు. మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ముసుగులో హవాలా మార్గంలో సొమ్ము తరలిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. రూ.417 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇటీవల సీజ్‌ చేసింది. ఈ కేసులో బాలీవుడ్‌కు చెందిన పలువురి పేర్లు తాజాగా వెలుగుచూడడం కలకలం రేపుతోంది.మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసు వ్యవహారం హిందీ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపింది. ప్రముఖ బాలీవుడ్ నటులు ఆన్‌లైన్‌లో యాప్‌ను ప్రచారం చేసి, అందుకు బదులుగా ప్రమోటర్ల నుంచి డబ్బు అందుకున్నారన్నది ఈడీ అభియోగాలు మోపింది. ఈ కేసులో 14 నుంచి 15 మంది సెలబ్రిటీలు, నటుల పాత్ర ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది.

Also Read: Sabarimala – Special Trains : జనవరి 31 దాకా శబరిమల ప్రత్యేక రైళ్లు ఇవే..

వాస్తవానికి మహాదేవ్‌ బెట్టింగ్ యాప్‌ సహా మరో 21 రకాల బెట్టింగ్ సాఫ్ట్‌వేర్‌లు, వెబ్‌సైట్లను ఇప్పటికే భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ లిస్టులో రెడ్డీ అన్న, ప్రెస్టోప్రో యాప్‌ల వంటివి ఉన్నాయి. మహాదేవ్‌ బెట్టింగ్ యాప్‌‌  నిర్వాహకులపై  అక్రమ లావాదేవీలు చేయడం, మనీ లాండరింగ్‌‌కు పాల్పడటం, మాజీ సీఎం భూపేష్ బఘేల్‌కు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఖర్చుకు నగదును సమకూర్చడం వంటి అభియోగాలను ఈడీ నమోదు చేసింది. ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 69ఎ ప్రకారం మహాదేవ్‌ బెట్టింగ్ యాప్‌, వెబ్‌సైట్‌‌‌లను నిషేధించాలని ప్రతిపాదించే అధికారం గత ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి ఉన్నప్పటికీ… మాజీ సీఎం బఘేల్ పట్టించుకోలేదని గతంలో కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ విమర్శించారు. ‘‘మాజీ సీఎం భూపేశ్‌ బఘేల్‌ యూఏఈకి వెళ్లిపోవాలని నన్ను ఆదేశించారు’’ అంటూ మహాదేవ్‌ బెట్టింగ్ యాప్‌‌  కేసులో కీలక నిందితుడు శుభం సోనీ విడుదల చేసిన ఒక వీడియో అసెంబ్లీ ఎన్నికల టైంలో సంచలనం క్రియేట్ చేసింది.