Haryana Assembly Elections: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 5న జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీల ఎన్నికల ప్రచారాలు జోరందుకుంది. ఈ క్రమంలోనే అంబాలాలోని నారైంగరాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో సోమవారం ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఓటర్లు తమ ఓటుతో తరిమికొట్టాలని అన్నారు. రైతులు, క్రీడాకారులు, సైనికులు యావత్ దేశ గౌరవాన్ని నిలబెడుతుండగా, బీజేపీ మాత్రం వారిని ఎప్పుడూ అవమానిస్తూనే ఉంది. గడచిన పదేళ్లలో రైతులపై లాఠీచార్జీ చేసి దారుణంగా ప్రవర్తించారు. రైతులు డిమాండ్ చేస్తున్న ఎంఎస్‌పి హామీని కూడా ఇవ్వలేదు. అసలు హర్యానా ప్రజల కోసం బిజెపి ఏం చేసిందో చెప్పాలని ప్రియాంక డిమాండ్ చేశారు. మన రెజ్లర్లను ఎలా ట్రీట్ చేశారో అందరికీ తెలుసు. రోడ్డుపై ఆందోళనలు చేసేలా చేశారు. కష్టపడి పనిచేసే హర్యానా పిల్లలకు ఉపాధి లభించలేదు’ అని ఆమె అన్నారు.
Read Also: Konda Surekha : తనపై చేస్తున్న ట్రోల్స్ కు కన్నీరు పెట్టుకున్న మంత్రి కొండా సురేఖ
‘మనం రెజ్లర్లు రోడ్డుపై నిరసన తెలియజేస్తున్నా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడూ వారి వద్దకు వెళ్లలేదు. వారితో మాట్లాడేందుకు ఐదు నిమిషాల టైం కూడా ఆయనకు లేదు. తాజాగా ఒలింపిక్స్‌లో ఏం జరిగిందో మీరంతా చూశారు. అందుకే, ఆత్మగౌరవం కోసం పోరాడండి. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పోరాడండి. బీజేపీని గద్దె దించడం కోసం పోరాడండి. రాష్ట్రంలోని ప్రజలంతా ఆత్మగౌరవంతో బ్రతకాలనుకుంటే, అందరికీ సమ న్యాయం జరగాలంటే మీ ఓటుతో బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టండి’ ప్రియాంక గాంధీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది. పేపర్ లీకేజీలు జరిగాయి. ప్రభుత్వ సంస్థల్లో ఖాళీలున్నాయి. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసిన బీజేపీ… ఇప్పుడు ఏదో చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే రైతులు, మల్లయోధులు, యువత అనేక సమస్యలను ఎందుకు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కేవలం కుంభకోణాలు మాత్రమే జరుగుతున్నాయి. హర్యానా ప్రజల ఆత్మగౌరవం కోసం… ప్రభుత్వ మార్పు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయండి అని హర్యానా ప్రజలను ప్రియాంక కోరారు.