Site icon HashtagU Telugu

Tragedy : ఇంత దారుణమా..? మురుగు కాల్వ కోసం తవ్విన గొయ్యిలో కొడల్ని పూడ్చిన అత్తింటివారు

Murder Case

Murder Case

Tragedy : హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలోని రోషన్ నగర్‌లో ఓ దారుణ సంఘటన వెలుగు చూసింది. అదనపు కట్నం కోసం భర్త, అత్త, మామ, బంధువులతో కలిసి ఓ యువతిని హత్య చేసి ఆమె మృతదేహాన్ని మురుగు కాల్వ కోసం తవ్విన గొయ్యిలో పూడ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్యకు గురైన యువతి తనూ, షికోహాబాద్‌కు చెందిన యువతి కాగా, ఆమె భర్త అరుణ్‌తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.

వివాహానంతరం కొద్దిరోజులకే అత్తింటివారి వేధింపులు ప్రారంభమయ్యాయని. బంగారం, డబ్బు కోసం మానసిక, శారీరక హింసకు గురిచేశారని తనూ సోదరి ప్రీతి పోలీసులకు తెలిపింది. ఏడాది పాటు తనూ పుట్టింట్లో ఉండిన తర్వాత, కొంత డబ్బు ఇచ్చి మళ్లీ అత్తింటికి పంపించగా పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. చివరగా ఈ సంవత్సరం ఏప్రిల్ 9న ఫోన్‌లో పుట్టింటివారితో మాట్లాడింది.

ఏప్రిల్ 23న తనూ ఇంటి నుంచి పారిపోయిందని అత్తింటివారు చెప్పడంతో ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే రెండు నెలల పాటు ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టి శుక్రవారం గొయ్యిలో నుంచి శవాన్ని వెలికితీశారు. స్థానికుల సమాచారం ప్రకారం, మురుగు కాల్వ కోసం తవ్వినట్లు చెప్పిన గుంతను హడావుడిగా పూడ్చి, పైగా కాంక్రీట్‌తో మూసివేశారు.

పోలీసులు అరుణ్‌తో పాటు అతని తల్లిదండ్రులు, బంధువులను అరెస్టు చేశారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో హత్య సుమారు రెండు నెలల క్రితం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటనపై గ్రామస్తులు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Iran-Israel : ఇరాన్ అణు కేంద్రాలే టార్గెట్ గా ఇజ్రాయెల్ క్షిపణి దాడులు