Domestic Violence Act : దేశంలోని ప్రతి మహిళకూ గృహ హింస చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మతం, సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా ఈ చట్టం అన్ని వర్గాల వనితలకు వర్తిస్తుందని తేల్చి చెప్పింది. మహిళల హక్కుల పరిరక్షణకు రాజ్యాంగం కల్పించే గ్యారంటీయే గృహ హింస చట్టమని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. భరణం, నష్టపరిహారం మంజూరుకు సంబంధించిన విషయంలో కర్ణాటక హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనంలో న్యాయమూర్తులు బీవీ నాగరత్న, ఎన్ కోటీశ్వర్ సింగ్ ఉన్నారు.
Also Read :Star Health Vs Telegram : టెలిగ్రాంపై స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ దావా.. ఎందుకంటే ?
కేసు వివరాల్లోకి వెళితే.. సదరు మహిళ గృహ హింస చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం గతంలో దిగువ కోర్టులో పిటిషన్ వేసింది. దాన్ని విచారించిన దిగువ కోర్టు 2015 ఫిబ్రవరిలో రూ.12వేలను ఆమెకు నెలవారీ భరణంగా, రూ.1 లక్షను పరిహారంగా చెల్లించాలని భర్తను ఆదేశించింది. అయితే ఆ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఎగువ కోర్టును సదరు మహిళ భర్త ఆశ్రయించాడు. అయితే చాలా ఆలస్యంగా అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారనే కారణంతో దాన్ని విచారించేందుకు ఎగువ కోర్టు నిరాకరించింది. ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఆ మహిళ భర్త గృహ హింస చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం మరో కోర్టులో (మొదటి అప్పీలేట్ కోర్టు) పిటిషన్ దాఖలు చేయగా అది కూడా తిరస్కరణకు గురైంది. చివరకు సదరు మహిళ భర్త గతేడాది ఏప్రిల్‌లో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయన పిటిషన్‌పై విచారణకు అనుమతి లభించింది.
Also Read :BJP – Reservations : రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ వెనుకాడదు.. కాంగ్రెస్ నేత చిదంబరం కామెంట్స్
పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. సదరు మహిళ భర్త పిటిషన్‌ను గృహ హింస చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం విచారణకు స్వీకరించాలని దిగువ కోర్టు (మొదటి అప్పీలేట్ కోర్టు) ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సదరు మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు బెంచ్.. ‘‘భార్యకు ఇప్పటికే చెల్లించిన భరణం, నష్టపరిహారాలను వెనక్కి తీసుకునే హక్కుకు భర్తకు ఉండదు’’ అని స్పష్టం చేసింది. ఆ మహిళ భర్తకు అనుకూలంగా కర్ణాటక హైకోర్టు, మొదటి అప్పీలేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు బెంచ్ తోసిపుచ్చింది. ‘‘భార్యకు చెల్లించాల్సిన భరణం, నష్టపరిహారానికి సంబంధించి మొత్తాలలో మార్పులను కోరుతూ కొత్త పిటిషన్ దాఖలు చేసే హక్కు భర్తకు(Domestic Violence Act) ఉంటుంది. ఇందుకు గృహ హింస చట్టంలోని సెక్షన్ 25 అనుమతి ఇస్తుంది’’ అని సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది.