Tamil Nadu Politics: ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే – అన్నాడీఎంకే చర్చలు..!

తమిళనాడు పేరు వినగానే మనకు గుర్తొచ్చే రాజకీయ పార్టీలు డీఎంకే, ఏఐఏడీఎంకే. ఇప్పటి వరకు ఈ రెండు పార్టీల చేతుల్లోనే తమిళనాడు సర్కారు మారగా.. ఇప్పుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికారంలోకి రాబోతుంది. అయితే విజయ్ వద్ద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మంది ఎమ్మెల్యేలు లేకపోవడంతో.. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా బద్ధశత్రువులుగా ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకేలు పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ పార్టీలు కలుస్తాయా, ఇవి ఎలా ఏర్పడ్డాయి, గొడవలు […]

Published By: HashtagU Telugu Desk
DMK and AIADMK Hold Talks on Government Formation

DMK and AIADMK Hold Talks on Government Formation

తమిళనాడు పేరు వినగానే మనకు గుర్తొచ్చే రాజకీయ పార్టీలు డీఎంకే, ఏఐఏడీఎంకే. ఇప్పటి వరకు ఈ రెండు పార్టీల చేతుల్లోనే తమిళనాడు సర్కారు మారగా.. ఇప్పుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికారంలోకి రాబోతుంది. అయితే విజయ్ వద్ద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మంది ఎమ్మెల్యేలు లేకపోవడంతో.. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా బద్ధశత్రువులుగా ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకేలు పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ పార్టీలు కలుస్తాయా, ఇవి ఎలా ఏర్పడ్డాయి, గొడవలు ఎందుకు వచ్చాయి, ఇప్పుడేమైనా కలిసే అవకాశం ఉందా లేదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

తమిళనాడు రాజకీయాలు అనగానే అందరికీ గుర్తొచ్చే పార్టీలు డీఎంకే, ఏఐఏడీఎంకే. చాలా ఏళ్లుగా ఈ రెండు పార్టీల మధ్యే ప్రభుత్వం చేతులు మారుతూ రాగా.. ఈసారి మాత్రం విజయ్ దళపతి నేతృత్వంలోని టీవీకే ఘన విజయం సాధించింది. అయితే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో.. డీఎంకే, ఏఐఏడీఎంకే పొత్తు పెట్టుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన చర్చలు రెండు పార్టీల మధ్య నడుస్తున్నట్లు కూడా వినిపిస్తోంది. అయితే ఇది విన్న దేశ ప్రజలంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా బద్ధ శత్రువులుగా ఉన్న ఈ రెండు పార్టీలు కలవడమేమిటని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీలు ఎలా ఏర్పడ్డాయి, అసలు వీరి మధ్య గొడవకు కారణం ఏంటని అంతా తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ల కోసమే ఈ స్టోరీ.

డీఎంకే పుట్టుకకు అసలు కారణమిదే..!

ముందుగా పెరియార్ రామస్వామి ‘ద్రవిడ కజగం’ (డీకే) అనే సామాజిక సంస్థను స్థాపించారు. అయితే అప్పటికే ఈ పార్టీలో చేరిన సీఎన్ అన్నాదురై.. పెరియార్ రామస్వామికి ప్రధాన అనుచరుడిగా నిలిచారు. కానీ పెరియార్ తన కంటే చాలా వయసులో చిన్నదైన మణియమ్మైని వివాహం చేసుకోవడం, ద్రవిడ కజగాన్ని రాజకీయ పార్టీగా మార్చడానికి నిరాకరించడం.. సీఎన్ అన్నాదురైకి ఏమాత్రం నచ్చలేదు. దీంతో 1949లో పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. రాగానే ‘ద్రవిడ మున్నేట్ర కజగం’ (డీఎంకే)ను స్థాపించారు. హిందీ భాషను తమిళులపై రుద్దడానికి వ్యతిరేకంగా, ద్రవిడ ఆత్మగౌరవ నినాదంతో డీఎంకే అనతి కాలంలోనే జనాదరణ పొందింది. కాంగ్రెస్‌ను ఓడించి తమిళనాడులో అధికార పీఠాన్ని దక్కించుకుంది.

ప్రాణస్నేహితుల్లా మెలిగిన కరుణానిధి, ఎంజీఆర్..

అయితే 1969లో అన్నాదురై మరణించగా.. ముఖ్యమంత్రి పీఠం కోసం నెడుంచెలియన్, కరుణానిధి పోటీ పడ్డారు. ఆ సమయంలో పార్టీలో తిరుగులేని ప్రజాదరణ ఉన్న ఎంజీఆర్.. కరుణానిధికి మద్దతు ఇచ్చి ఆయనను సీఎం చేశారు. కానీ సీఎం అయ్యాక కరుణానిధికి ఎంజీఆర్ ప్రజాదరణ చూసి భయం పట్టుకుంది. దీంతో ఎంజీఆర్ ఇమేజ్‌కు పోటీగా తన కుమారుడు ముత్తును సినిమాల్లోకి తెచ్చే ప్రయత్నం చేశారు కరుణానిధి. అయితే తనను తొక్కేస్తున్నారన్న విషయం గుర్తించిన ఎంజీఆర్.. డీఎంకేలో అవినీతి పెరిగిపోయిందని, పార్టీ నిధులు, ఆస్తుల వివరాలను బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీన్ని ఏమాత్రం సహించలేని కరుణానిధి.. క్రమశిక్షణా రాహిత్యాల సాకుతో 1972లో ఎంజీఆర్‌ను డీఎంకే నుంచి బహిష్కరించారు.

కరుణానిధిని ఎంజీఆర్ దెబ్బ కొట్టారిలా…!

దీనికి ప్రతీకారంగా ఎంజీఆర్.. అన్నాదురైపై గౌరవంతో ‘ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం’ (ఏఐఏడీఎంకే)ను స్థాపించి.. డీఎంకేను కోలుకోలేని దెబ్బ కొట్టారు. ముఖ్యంగా 1976లో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించినప్పుడు కరుణానిధి దాన్ని వ్యతిరేకించారు. ఆ తరుణాన్ని వాడుకున్న ఎంజీఆర్.. కరుణానిధి అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఇందిరా గాంధీ డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేశారు. 1977లో ముఖ్యమంత్రి అయిన ఎంజీఆర్.. తాను చనిపోయే వరకు కరుణానిధిని ముఖ్యమంత్రిని కానివ్వలేదు. పదేళ్ల పాటు అంటే 1987 వరకు కరుణానిధిని ప్రతిపక్ష నేతగానే ఉంచారు.

జయలలితకు అసెంబ్లీలో అవమానం..!

ఎంజీఆర్ మరణానంతరం అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టిన జె. జయలలితపై డీఎంకే కక్ష సాధింపు చర్యలకు దిగింది. 1989 మార్చి 25వ తేదీన తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. డీఎంకే సభ్యులు జయలలితపై దాడికి దిగి, ఆమె చీరను లాగి ఘోరంగా అవమానించారు. చెదిరిన జుట్టుతో, కన్నీళ్లతో సభ నుంచి బయటకు వచ్చిన జయలలిత.. “మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ అసెంబ్లీలో అడుగు పెడతాను” అని ప్రతిజ్ఞ చేశారు. అన్నట్లుగానే 1991లో అఖండ మెజారిటీతో సీఎం అయ్యారు.

అర్ధరాత్రి అరెస్టులు..!

జయలలిత సీఎం అయ్యాక కరుణానిధిని రాజకీయంగా అణచివేయడానికి ప్రయత్నించారు. ఫ్లైఓవర్ల నిర్మాణంలో అవినీతి జరిగిందనే కేసులో కరుణానిధిపై చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా 2001 జూన్ 29వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 77 ఏళ్ల వయసున్న కరుణానిధిని పోలీసులు ఆయన పడకగది నుంచి ఈడ్చుకుంటూ వెళ్లి అక్రమంగా అరెస్ట్ చేశారు. అప్పుడు కరుణానిధి గట్టిగట్టిగా అరుస్తూ.. నన్ను చంపేస్తున్నారంటూ రచ్చ చేయడం అది టీవీల్లో లైవ్ రావడం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ముఖ్యంగా కరుణానిధిని కాపాడేందుకు వచ్చిన కేంద్ర మంత్రులు మురసోలి మారన్, టి.ఆర్. బాలులపై కూడా పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు.

అంతకుముందు కరుణానిధి అధికారంలో ఉన్నప్పుడు జయలలితను కలర్ టీవీల కొనుగోలు కుంభకోణంలో జైలుకు పంపగా, దానికి ప్రతీకారంగానే జయలలిత ఈ అరెస్టు చేయించారనే ప్రచారం జరిగింది. ఇలా ఈ ఇద్దరు నేతలు బతికున్నంత కాలం తమిళనాడు రాజకీయం పగ, ప్రతీకారం, జైలు గోడల చుట్టూనే తిరిగింది. మరి అలాంటి పార్టీలు ఇప్పుడు తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒక్కటవుతాయా లేదా అనేది చూడాలి.

  Last Updated: 07 May 2026, 10:12 AM IST