Divy Ayodhya : జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభం కానుంది. ఆ మరుసటి రోజు నుంచే అయోధ్య రాముడి దర్శనం కోసం సామాన్య భక్తులను అనుమతించనున్నారు. వారికి అసౌకర్యం కలగకుండా చూసేందుకు.. అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ‘దివ్య్ అయోధ్య’ (Divy Ayodhya) యాప్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా అయోధ్యా నగరంలోని వివిధ ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా హోమ్‌స్టే (పర్యాటకులకు ఇంట్లో ఒక గదిని అద్దెకు ఇవ్వడం), హోటళ్లు, గుడారాలు, వీల్‌ఛైర్ అసిస్టెంట్, గోల్ఫ్‌కార్ట్ వాహనాలు, ఎలక్ట్రిక్ కార్లు, బస్సులను, టూరిస్ట్ గైడ్‌లను అడ్వాన్స్ బుకింగ్స్ చేయొచ్చు. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చారు. దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని లాగిన్ అవ్వాలి. యాప్‌లో స్థానిక వంటలు, తప్పక చూడాల్సిన ప్రదేశాలు, టూర్ ప్యాకేజీల వివరాలు ఉంటాయి. ఇప్పటికే అయోధ్యకు ధర్మ పథ్, రామ్ పథ్ పేరుతో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను కూడా ప్రారంభించారు. జనవరి 19 నుంచి లఖ్‌నవూ- అయోధ్య మధ్య హెలికాప్టర్ సర్వీస్‌ను ప్రారంభించనున్నారు. జనవరి 22న ప్రధాని మోడీ అయోధ్య రామమందిరం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే వారికి దేశీ నెయ్యితో తయారుచేసిన మోతిచూర్ లడ్డూతో పాటు అయోధ్య మట్టిని చిన్న బాక్సుల్లో అందజేయనున్నారు. ఆహ్వానితులు ఎవరైనా ఈ కార్యక్రమానికి రాలేకపోతే వారు అయోధ్యను సందర్శించినప్పుడు ఈ మట్టిని అందజేస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
దేశవిదేశీ భక్తులు సైతం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్యలోని రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం నిశ్చయమైంది. జనవరి 22వ తేదీ 12.20 గంటలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొదలై మధ్యాహ్నం 2.00 గంటలకు ముగుస్తుంది. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.”జనవరి 16వ తేదీ నుంచి ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభమై 21వ తేదీ వరకూ జరుగుతాయి. 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ జరుగనున్న విగ్రహం బరువు 150 నుంచి 200 కేజీల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నాం. జనవరి 18న ఆలయ గర్భగుడిలో విగ్రహాన్ని ఉంచుతాం” అని చంపత్ రాయ్ తెలిపారు. చారిత్రక రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా లక్షలాది మంది టూరిస్టులకు అయోధ్య స్వాగతం పలుకుతోంది. వాహన సర్వీసులను వేగవంతంగా నడిపేందుకు అయోధ్యను ఇతర నగరాలతో కనెక్ట్ చేసే రోడ్లను కూడా పునర్నిర్మించారు.