Site icon HashtagU Telugu

Manipur CM : ‘‘సీఎం వల్లే హింసాకాండ ?’’.. ఆడియో క్లిప్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Manipur Cm Biren Singh Manipur Violence Supreme Court Kuki Tribes

Manipur CM : మణిపూర్‌లో జరిగిన హింసాకాండ ఎంతోమంది మాన, ప్రాణాలను బలిగొంది. కొందరి రాక్షస, అమానుష చేష్టల వల్ల ఆ రాష్ట్రం దాదాపు రెండేళ్ల పాటు అట్టుడికింది. ప్రజలు ఎన్నుకున్న బీజేపీ ప్రభుత్వం ఉన్నా.. మణిపూర్‌లో ఇంత దారుణంగా హింసాకాండ ఎలా జరిగింది ? అనే దానిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. పలు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా ప్రశ్నలు సంధించాయి. ఈ నేపథ్యంలో మరో సంచలన అంశం తెరపైకి వచ్చింది.

Also Read :Jimmy Carter : మాజీ దేశాధ్యక్షుడికి గ్రామీ అవార్డ్.. ఇంద్రానూయి సోదరికి కూడా..

సీజేఐ సారథ్యంలోని బెంచ్..

మణిపూర్‌లో జరిగిన హింసాకాండ వెనుక ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌ సింగ్‌ (Manipur CM) ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి పలు ఆడియోలు బయటికి వచ్చాయి. ఈమేరకు అభియోగాలతో కుకీ ఆర్గనైజేషన్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ ట్రస్టు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌కుమార్‌‌లతో కూడిన ధర్మాసనం దీన్ని విచారించింది. సీఎం బీరేన్ సింగ్‌కు సంబంధించినవి అని ప్రచారం జరుగుతున్న ఆడియో క్లిప్‌లపై కేంద్ర ప్రభుత్వ ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ను అందించాలని సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించింది.

Also Read :Gun Firing Case : బత్తుల ప్రభాకర్ టార్గెట్.. రూ.333 కోట్లు, 100 మంది యువతులు..

పిటిషనర్ వాదన ఇదీ.. 

ఆయా ఆడియో క్లిప్‌లను ‘ట్రూత్‌ ల్యాబ్స్‌’ ఇప్పటికే పరిశీలించిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు.  అందులోని వాయిస్‌,  సీఎం బీరేన్ సింగ్ గొంతుతో 93 శాతం సరిపోలిందని చెప్పారు. పిటిషనర్ వాదనపై స్పందించిన సుప్రీంకోర్టు బెంచ్.. ఈ ఆడియోలకు సంబంధించి తమకు ప్రభుత్వ ఫోరెన్సిక్‌ లేబొరేటరీ ‘సీఎఫ్ఎస్‌ఎల్’ నివేదిక  కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈమేరకు సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు కూడా ఆదేశాలు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణను మార్చి 24వ తేదీకి వాయిదా వేసింది.

ఏమిటీ కేసు ?

మణిపూర్‌లో హింసాకాండను ప్రేరేపించేలా ఉన్న వ్యాఖ్యలతో కూడిన ఒక ఆడియో క్లిప్ గతంలో వైరల్ అయింది. అందులో అచ్చం  సీఎం బీరేన్ సింగ్ తరహా గొంతు ఉంది. తొలుత ఈ ఆడియో క్లిప్‌‌లోని కొంత భాగాన్ని 2024 సంవత్సరం ఆగస్టు 7న కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (కేఎస్‌ఓ) విడుదల చేసింది. దీనిలోని మరో భాగాన్ని 2024 సంవత్సరం ఆగస్టు 20న విడుదల చేసింది. అయితే ఈ ఆడియో క్లిప్‌లో వాస్తవికత లేదని పేర్కొంటూ 2024 సంవత్సరం ఆగస్టు 7న మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఈ ఆడియో క్లిప్‌ను మణిపూర్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ లాంతిన్ తాంగ్ హావోకిప్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ ఆడియో క్లిప్‌పై దర్యాప్తు చేయాలని కుకీ వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కేంద్ర హోంశాఖను కోరారు.