Prizes For Voters : ఓటు వజ్రాయుధం. ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి భోపాల్ జిల్లా ఎన్నికల అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓటేసిన ప్రజలకు లక్కీ డ్రా ద్వారా డైమండ్ రింగులు, ల్యాప్ టాప్‌లు, స్కూటర్లు, బైక్‌లు, ఫ్రిజ్‌లను అందజేస్తామని వెల్లడించారు. ఇంతకీ ఈ నిర్ణయాన్ని భోపాల్ జిల్లా ఎన్నికల అధికారులు ఎందుకు తీసుకున్నారో తెలుసా ? ఇప్పటికే మన దేశంలో రెండు విడతల పోలింగ్ జరిగింది. ఈ రెండు దశల్లో మధ్యప్రదేశ్‌లోని లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ గత ఎన్నికల కంటే 8.5 శాతం తక్కువగా నమోదైంది.తదుపరి విడతల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకుగానూ ఓటర్లను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి ఆకర్షణీయమైన గిఫ్టులను అందిస్తామని భోపాల్ జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే ఈ ప్రయోగం ఫలించి.. మే 7న జరిగే మూడో దశ ఎన్నికల్లో ఓటింగ్(Prizes For Voters) శాతం ఎంత పెరుగుతుందో వేచిచూడాలి.
We’re now on WhatsApp. Click to Join
ఓటర్ల లక్కీ డ్రా ఎలా ?
- భోపాల్ నియోజకవర్గంలో మొత్తం 2,097 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి.
- ప్రతి పోలింగ్ బూత్ వద్ద మూడు లక్కీ డ్రాలను నిర్వహిస్తారు.
- ఓటు వేసే వాళ్లంతా లక్కీ డ్రాలో పాల్గొనేందుకు కోసం భోపాల్‌లోని పలు మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ఇతర ప్రదేశాల్లో కూపన్ బాక్సులను ఏర్పాటు చేశారు.
- ఈ లక్కీ డ్రాలో బంపర్ బహుమతులతో పాటు దాదాపు 6000కుపైగా ఇతర గిఫ్ట్స్ అందుబాటులో ఉన్నాయి.
- ఓటర్లు తమ మొబైల్ నంబర్లు, పేర్లు, ఓటర్ ఐడీతో కూడిన ఫామ్‌లను నింపి అధికారులు ఏర్పాటు చేసిన కూపన్ బాక్సులో వేయాలి.
- యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచితంగా సినిమా టికెట్లను కూడా లక్కీ డ్రాలో భాగంగా అందజేయనున్నట్టు తెలుస్తోంది.
- ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం డ్రా తీసి గెలిచిన వారికి బహుమతులు అందిస్తారు.
- డ్రాలో విజేతగా నిలిచిన వారు వేలిపై చెరగని సిరాను చూపించాల్సి ఉంటుంది.