Maharashtra CM : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఈ తరుణంలో కాబోయే మహారాష్ట్ర సీఎం ఎవరు అనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది. ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండేనే కొనసాగిస్తారా ? ఏదైనా మార్పు చేస్తారా ? అనే దానిపై డిస్కషన్ నడుస్తోంది. ఈ తరుణంలో మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ ధరేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన వెల్లడించారు.
Also Read :Wayanad Win : ప్రియాంకకు 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీ.. ఢిల్లీ ఆఫీసుకు రాబర్ట్ వాద్రా
ముంబైకు బీజేపీ కేంద్ర పరిశీలకులు
మహాయుతి కూటమి గెలుపు నేపథ్యంలో ఇవాళ సాయంత్రంలోగా ముంబైకు బీజేపీ అధిష్ఠానం పార్టీ కేంద్ర పరిశీలకులను పంపనుంది. వారు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయం ఆధారంగా తదుపరిగా జరగనున్న మహాయుతి కూటమి పార్టీల భేటీలో సీఎం సీటుపై(Maharashtra CM) చర్చలు జరగనున్నాయి. ఈ వార్త పబ్లిష్ అయ్యే సమయానికి మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ సీట్లకుగానూ 122 చోట్ల బీజేపీ, 58 చోట్ల ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన ఆధిక్యంలో ఉన్నాయి. అజిత్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీ 34 చోట్ల లీడ్‌లో ఉంది. అత్యధిక సీట్లు సాధించిన పార్టీ బీజేపీకే సీఎం సీటు దక్కాలనే అభిప్రాయం మహారాష్ట్ర బీజేపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
Also Read :Maharashtra Elections 2024: ‘‘ఏదో గడ్బడ్ చేశారు.. ఇది ప్రజాతీర్పు కాదు’’.. ‘మహా’ ఫలితాలపై సంజయ్ రౌత్
మోడీ, నడ్డా గైడెన్స్‌తో సీఎం ఎంపిక : ఏక్‌నాథ్ షిండే
‘మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరు’ అనే దానిపై ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. మహాయుతి కూటమిలోని పార్టీలన్నీ సమావేశమై చర్చించి సీఎంగా ఎవరు ఉండాలి అనేది నిర్ణయిస్తాయని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు తాము ఎన్నికల్లో గెలుపు గురించి మాత్రమే ఆలోచించామని.. తదుపరిగా సీఎం సీటు గురించి ఆలోచిస్తామని షిండే తెలిపారు. త్వరలోనే బీజేపీ, షిండే సేన, అజిత్ పవార్ ఎన్‌సీపీ సమావేశమవుతాయని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాల గైడెన్స్ ప్రకారం తదుపరి సీఎం ఎవరు అనేది డిసైడ్ అవుతుందన్నారు. ఎన్నికల్లో ఏ విధంగానైతే కలిసి పనిచేశామో.. సీఎం సీటుపై నిర్ణయం విషయంలోనూ అదే విధంగా కలిసి పనిచేస్తామని షిండే స్పష్టం చేశారు. ఇక ఈనెల 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. ఎన్డీయే కూటమి గెలిచినందున.. అది 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సి ఉంది. లేదంటే రాష్ట్రపతి పాలన అమల్లోకి వస్తుంది.