Devegowda : జాతీయ స్థాయిలో విప‌క్షాల కూట‌మికి షాక్ ఇవ్వబోతున్న దేవెగౌడ.. అస‌లు కార‌ణం అదేన‌ట‌..

తొలుత విప‌క్షాల కూట‌మిలో క‌లిసేందుకు సిద్ధ‌మ‌యిన క‌ర్ణాట‌క జనతా దళ్ (సెక్యులర్) పార్టీ అధినేత, మాజీ ప్ర‌ధాని దేవెగౌడ (Devegowda) ఒక్క‌సారిగా రూట్ మార్చిన‌ట్లు క‌నిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - June 9, 2023 / 07:30 PM IST

బీజేపీయేత‌ర పార్టీల‌న్నింటిని ఒకేతాటిపైకి తెచ్చేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్(Bihar CM Nitish Kumar) ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్(Congress) పార్టీని ముందుంచి మిగిలిన బీజేపీయేత‌ర‌ ప్రాంతీయ పార్టీల‌ను ఒకేతాటిపైకి తేవ‌డం ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు చెక్ పెట్టొచ్చ‌ని నితీష్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ మ‌ల్లిఖార్జున్‌ ఖ‌ర్గే, రాహుల్ గాంధీ(Rahul Gandhi)తోనూ చ‌ర్చ‌లు జ‌రిపారు. నితీష్ ప్ర‌య‌త్నంతో దేశంలోని ప‌లు బీజేపీ(BJP)యేత‌ర పార్టీలు ఏక‌మ‌వుతున్నాయి. అయితే, నితీష్, కాంగ్రెస్ ప్ర‌య‌త్నాల‌కు చెక్‌పెట్టేందుకు బీజేపీకూడా అంతేపావులు క‌దుపుతోంది.

విప‌క్షాల కూట‌మి స‌మావేశం ఈనెల 12న పాట్నాలో జ‌ర‌గాల్సి ఉంది. అయితే, ఈ స‌మావేశంకు రాహుల్‌, త‌మిళ‌నాడు సీఎంతో స‌హా ప‌లువురు ముఖ్య‌నేత‌లు అందుబాటులో లేక‌పోవ‌టంతో భేటీని 23వ తేదీకి వాయిదా వేశారు. అయితే నితీష్ ప్ర‌య‌త్నాల‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ‌త‌గిలింది. తొలుత విప‌క్షాల కూట‌మిలో క‌లిసేందుకు సిద్ధ‌మ‌యిన క‌ర్ణాట‌క జనతా దళ్ (సెక్యులర్) పార్టీ అధినేత, మాజీ ప్ర‌ధాని దేవెగౌడ(Devegowda) ఒక్క‌సారిగా రూట్ మార్చిన‌ట్లు క‌నిపిస్తోంది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌రువాత ఆ రాష్ట్రంలో జేడీ(ఎస్‌)(JDS) భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకొని బీజేపీకి ద‌గ్గ‌ర‌వుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

కూట‌మి ప్ర‌య‌త్నాల‌కు గాలితీసేలా దేవేగౌడ వ్యాఖ్య‌లు చేయ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌రువాత త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి బీజేపీపై పొగ‌డ్త‌లు జ‌ల్లు కురిపిస్తున్నారు. త‌ద్వారా 17ఏళ్ల క్రితం తెగిపోయిన బంధానికి చిగురు తొడ‌గాల‌ని చూస్తున్నారు. కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో కూట‌మి జ‌ట్టుక‌ట్టేందుకు వ‌స్తున్న పార్టీలు బీజేపీతోనూ మిత్రుత్వం న‌డుపుతున్న‌ట్లు బాంబు పేల్చారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో దోస్తానా చేస్తున్న డీఎంకే ఒక‌ప్పుడు బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మేన‌ని గుర్తు చేశారు. ఎన్నిక‌ల వ‌ర‌కు బీజేపీ పంచాయ‌తీ ఉన్న‌ట్లు చెబుతుంటారు. ఆ త‌రువాత క‌మ‌ల‌ద‌ళంతో క‌లిసిపోతుంటారు. ఇదే విప‌క్షాల ఆలోచ‌న అంటూ దేవెగౌడ విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు, ఇటీవ‌ల జ‌రిగిన రైలు ప్ర‌మాదంలో ప్ర‌తిప‌క్షాల‌న్నీ కేంద్ర రైల్వేశాఖ మంత్రి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తుంటే.. దేవెగౌడ మాత్రం.. రైలు ప్ర‌మాదానికి ప్ర‌భుత్వం ఎలా కార‌ణ‌మ‌వుతుంద‌ని ప్ర‌శ్నించటం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కర్ణాట‌క ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో విప‌క్షాల కూట‌మిలో భాగ‌స్వామ్యం అయ్యేందుకు ఆస‌క్తిచూపిన దేవెగ‌డౌ, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం త‌రువాత విప‌క్షాల కూట‌మిపై సెటైర్లు వేయ‌టం వెనుక పెద్ద‌కార‌ణ‌మే ఉన్న‌ట్లు తెలుస్తోంది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. అయితే, ఈ ఎన్నిక‌ల త‌రువాత రాష్ట్రంలో ఏ పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌న్నా జేడీఎస్ కీల‌కంగా మారుతుంద‌ని దేవెగౌడ ఆశించారు. కానీ ప్ర‌జ‌లు ఆ పార్టీని తిర‌స్క‌రించారు. అంతేకాక‌, జేడీఎస్ ఓటు బ్యాంకు భారీగా కాంగ్రెస్ పార్టీకి వెళ్లింది. దీంతో దేవెగౌడ కాంగ్రెస్ పై ఆగ్ర‌హంతో ఉన్నార‌ట‌. ప్ర‌స్తుతం కాంగ్రెస్ కూట‌మితో జ‌ట్టు క‌డితే సొంత రాష్ట్రంలో పార్టీ మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదం వ‌స్తుంద‌న్న భావ‌న‌లో దేవెగౌడ ఉన్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బీజేపీకి ద‌గ్గ‌ర‌వుతున్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. మొత్తానికి విప‌క్షాల కూట‌మి ఏర్పాటుకు దేవెగౌడ రూపంలో ఆదిలోనే గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింద‌ని చెప్పొచ్చు.

 

Also Read : Bjp New Alliances : 2024లో కొత్త “పొత్తు” పొడుపులు..బీజేపీకి న్యూ ఫ్రెండ్స్