Aurangzebs Tomb: మహారాష్ట్రలోని బీజేపీ సర్కారు వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ రాష్ట్రంలోని ఖుల్దాబాద్ పట్టణంలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిపై ఇప్పుడు వివాదం రాచుకుంది. ఈ సమాధిని తొలగించాలని సతారా లోక్‌సభ బీజేపీ ఎంపీ, ఔరంగాబాద్ వాస్తవ్యుడు ఉదయన్ రాజే భోసాలే మార్చి 7న డిమాండ్ చేశారు. ‘‘ఔరంగజేబు సమాధిని కాపాడాల్సిన అవసరం ఏముంది ? ఆయనొక దొంగ, దోపిడీదారుడు. అలాంటి ఔరంగజేబును గౌరవించే వాళ్లు.. ఆయన సమాధిని తీసుకెళ్లి తమతమ ఇళ్లలో పెట్టుకోవాలి’’ అని రాజే భోసాలే వ్యాఖ్యానించారు.
Also Read :AR Rahman : ఏఆర్ రెహమాన్‌కు ఛాతీనొప్పి.. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స
సీఎం సైతం అదే విధమైన కామెంట్స్‌తో..
తదుపరిగా ఈ వ్యాఖ్యలను సమర్ధించేలా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడారు. ‘‘ఔరంగజేబు(Aurangzebs Tomb) సమాధిని తొలగించాలని మెజారిటీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మేం ఏదైనా చర్య తీసుకుంటే, అది చట్టపరంగానే ఉంటుంది. ఆ సమాధి ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) పరిధిలోని రక్షిత ప్రదేశాల లిస్టులో ఉందనే విషయం మాకు తెలుసు’’ అని సీఎం తెలిపారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాతి నుంచి ఔరంగజేబు సమాధి సందర్శనకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. గతంలో దీన్ని చూసేందుకు ప్రతిరోజు 3వేల మంది వచ్చేవారు. ఇప్పుడా సంఖ్య 300కు తగ్గిపోయింది. ఇలాంటి రాజకీయాల వల్ల టూరిజం దెబ్బతింటుందని, సామాజిక అశాంతి ప్రబలుతుందని రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read :Sunita Williams : 19న భూమికి సునితా విలియమ్స్.. ఈ ఆరోగ్య సమస్యల గండం
ఔరంగజేబు సమాధి గురించి..
- ఔరంగజేబు గుజరాత్‌లోని దాహోద్‌లో 1618 సంవత్సరం నవంబరు 3న జన్మించారు. ఆయన 1707 సంవత్సరం మార్చి 3న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ (ఇప్పటి అహల్యా నగర్)లో తుదిశ్వాస విడిచారు.
- ఔరంగజేబు భౌతిక కాయాన్ని ఖుల్దాబాద్ పట్టణంలో ఖననం చేశారు.
- చనిపోయాక తన గురువు సయ్యద్ జైనుద్దీన్ సిరాజీ సమాధి పక్కనే తన సమాధి ఉండాలని ఔరంగజేబు వీలునామాలో రాశారు.
- ఈ వీలునామా ప్రకారం ఔరంగజేబు కుమారుడు ఆజం షా.. తన తండ్రి సమాధిని ఖుల్దాబాద్‌లో నిర్మించారు.
- వీలైనంత తక్కువ ఖర్చులో తన అంత్యక్రియలను పూర్తి చేయాలని వీలునామాలో ఔరంగజేబు రాశారట. తన అంత్యక్రియల ఖర్చుల కోసం ప్రభుత్వం డబ్బును వాడొద్దని అందులో స్పష్టంగా పేర్కొన్నారట. కేవలం తన కష్టార్జితంతోనే అంత్యక్రియలను నిర్వహించాలని ఔరంగజేబు వీలునామాలో ప్రస్తావించారట.
- అప్పట్లో ఔరంగజేబు అంత్యక్రియల కోసం 14 రూపాయల 12 అణాలను ఖర్చు పెట్టారట.