Delhi CM : ఢిల్లీకి కాబోయే సీఎం ఎవరు ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంత ఉత్కంఠకు కారణం.. బీజేపీ హైకమాండ్ అనూహ్య నిర్ణయాలు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కొత్త సీఎంల ఎంపికలో కమలదళం పెద్దలు అనూహ్య ప్రకటనలు చేశారు. ఎవరూ ఊహించని నేతలకు సీఎం పీఠాన్ని అప్పగించారు. సీనియారిటీతో పాటు పలు ఇతరత్రా కొలమానాలను కూడా ఈసందర్భంగా వారు పరిగణనలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ సీఎం ఎంపిక వ్యవహారంలోనూ అవన్నీ పరిగణనలోకి తీసుకోనున్నారు. అయితే ఈసారి ఎవరూ ఊహించని విధంగా ఢిల్లీ సీఎం పీఠాన్ని ఒక మహిళా నేతకు అప్పగిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు చూద్దాం.
Also Read :Bird Flu : బర్డ్ ఫ్లూ వల్లే కోళ్ల మరణాలు.. మాంసం, గుడ్లు తినొచ్చా ?
పర్వేశ్ వర్మకు..
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మకు సీఎం(Delhi CM) సీటు ఇస్తారనే ప్రచారం తొలుత జరిగింది. ఢిల్లీ బీజేపీ సీనియర్ నేతలు వీరేంద్ర గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ, ఆశిష్ సూద్, పవన్ వర్మల పేర్లను కూడా బీజేపీ పెద్దలు పరిశీలిస్తున్నారనే టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ నేతల నుంచి ఒకరికి డిప్యూటీ సీఎం పదవిని ఇస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పుడు మహిళనే ఢిల్లీ సీఎం చేస్తారనే ప్రచారం మొదలైంది. ఈసారి ఢిల్లీలో బీజేపీ నుంచి నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు.వారి పేర్లు.. రేఖా గుప్తా(షాలిమార్ బాగ్), నీలం పెహల్వాన్(నజఫ్‌గఢ్), శిఖా రాయ్(గ్రేటర్ కైలాష్), పూనం శర్మ(వాజీపూర్).
Also Read :IDBI Bank : ప్రైవేటీకరణకు సిద్దమైన ఐడీబీఐ బ్యాంక్
మెజారిటీపరంగా..
ఈ నలుగురిలో ఒకరికి సీఎం సీటు దక్కొచ్చన్న మాట. ఈ ఎన్నికల్లో వీరు సాధించిన ఓట్ల మెజారిటీని పరిశీలిస్తే.. రేఖా గుప్తా, నీలం పెహల్వాన్‌లు 29 వేలకుపైగా ఓట్ల మెజారిటీని సాధించారు. పూనం శర్మ 11 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీని పొందారు. శిఖా రాయ్ 3,188 ఓట్ల మెజారిటీని సాధించారు. ఈ మహిళల్లో ఓబీసీ, దళిత వర్గాల వారికి ప్రయారిటీ దక్కొచ్చు. ఇప్పటిదాకా ఢిల్లీకి ముగ్గురు మహిళలు సీఎంలు అయ్యారు. వీరిలో తొలి వ్యక్తి బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్. కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్, ఆప్ నేత అతిషి సీఎంలు అయ్యారు. ఈసారి ఆ అవకాశం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.