Shock To Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు షాకిచ్చాయి. ఇప్పటివరకు (ఉదయం 10.25 గంటలు) వెలువడిన ఫలితాల ప్రకారం.. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగానూ 40 చోట్ల బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఆప్ అభ్యర్థులు కేవలం 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. సంక్షేమ పథకాల హామీలతో ఢిల్లీ ప్రజలను ఆకట్టుకోవాలని యత్నించిన అరవింద్ కేజ్రీవాల్ వ్యూహం ఫలించలేదు. పదేళ్ల ఆప్ పాలనతో విసిగివేసారిన ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకున్నారు. కాంగ్రెస్, బీజేపీలలో దేన్ని ఎంచుకోవాలి ? అనే ప్రశ్నకు సమాధానంగా ‘బీజేపీ’ వైపు చూశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అయితేనే ప్రస్తుతానికి బెటర్ అని హస్తిన ప్రజానీకం భావించారు. ఇదే అంశం ఇప్పుడు వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read :Machilipatnam SBI : మచిలీపట్నమా మజాకా.. అక్కడి బ్యాంకుకు 219 ఏళ్ల చరిత్ర.. అదెలా ?
కేజ్రీవాల్, అతిషి వెనుకంజ
న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Shock To Kejriwal) పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెనుకంజలో ఉన్నారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి పర్వేష్ సింగ్ వర్మ ముందంజలో ఉన్నారు. ఇక కల్కాజీ అసెంబ్లీ స్థానంలో ఆప్ అగ్రనేత, సీఎం అతిషి వెనకంజలో ఉన్నారు.
ఆప్‌ను దెబ్బతీసిన అంశాలు ఇవీ..
- ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో మొదటిది అవినీతి ఆరోపణలు.
- అరవింద్ కేజ్రీవాల్ నుంచి మొదలుకొని మనీశ్ సిసోడియా దాకా పార్టీ అగ్రనేతలంతా జైలుకు వెళ్లి వచ్చారు. ఈ అంశం వల్ల జనంలో ఆప్‌పై నెగెటివ్ ఫీలింగ్ ఏర్పడింది.
- జైలుకు వెళ్లినా సీఎం పదవిని కేజ్రీవాల్ వదులుకోక పోవడాన్ని ప్రజలు తప్పుపట్టారు. ప్రజాపాలన కంటే సీఎం పదవిని కాపాడుకునేందుకే కేజ్రీవాల్ మొగ్గుచూపారనే భావన జనంలో వచ్చింది. ఆప్ నిర్వహించిన అంతర్గత సర్వేల్లో ఈ విషయాన్ని గుర్తించబట్టే, ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆయన సీఎం పదవిని వదులుకున్నారు.
- ఆప్‌తో కాంగ్రెస్ పార్టీ దోస్తీని కోరుకుంది. కానీ ఆప్ మాత్రం అత్యాశకు పోయి ఒంటరి పోరాటానికి సిద్ధపడింది. దీంతో చాలా అసెంబ్లీ స్థానాల్లో ఆప్ ఓట్లను కాంగ్రెస్ విజయవంతంగా చీల్చింది.
- ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసం నిర్మాణంలో జరిగిన అవకతవకల వ్యవహారం ప్రజలను ఆలోచింపజేసింది.
- ఢిల్లీలోని వాయు కాలుష్యం, యమునా నదీ జలాల్లో కాలుష్యం అంశాలు ఢిల్లీ వాసులను ఆప్‌కు దూరం చేశాయి. గత పదేళ్లలో ఆప్ ఏమీ చేయలేకపోయిందనే భావన ఓటర్లకు వచ్చింది.
- ఆప్ నుంచి కీలక నేతలు బీజేపీలోకి వలస వెళ్లడం అనేది .. ఆప్‌ను అంతర్గతంగా బలహీనం చేసింది. ఎన్నికల పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు దాదాపు 8 మంది ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ కావడం పెద్ద మైనస్ పాయింటుగా మారింది.
విక్టరీ దిశగా బీజేపీ
ఢిల్లీలో 27 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత బీజేపీ గెలుపు దిశగా పయనిస్తోంది. చివరిసారిగా 1993లో ఢిల్లీలో బీజేపీ గెలిచింది. 1998 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చింది. 2013, 2015, 2020 ఎన్నికల్లో ఆప్ విజయఢంకా మోగించింది.