Free Electricity And Water : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ (ఫిబ్రవరి 5) సమీపించిన వేళ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన హామీలు ప్రకటించారు. ఈసారి బీజేపీ నుంచి టఫ్ ఫైట్ ఎదురవుతున్న తరుణంలో ఆయన ఢిల్లీలోని అద్దెదారులకు గుడ్ న్యూస్ వినిపించారు. ఈసారి ఎన్నికల్లో ఆప్ గెలిస్తే ఢిల్లీలో అద్దె ఇళ్లలో నివసించే వారికి ఉచితంగా విద్యుత్‌ను, నీటిని అందిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన అనేకమంది కౌలుదారులకు సైతం ఉచిత విద్యుత్, నీటి సౌకర్యాలు అందిస్తామని వెల్లడించారు. ‘‘అద్దె ఇళ్లలో నివసించే వారి బాధలు నాకు తెలుసు. అందుకే వారికి ఉచిత విద్యుత్, నీరు ఇవ్వాలని నిర్ణయించాం’’ అని కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటికే ఢిల్లీలో పేదలకు ఉచిత విద్యను, ఉచిత వైద్యాన్ని అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆప్ ఇప్పటికే ఢిల్లీలోని వృద్ధుల కోసం సంజీవని స్కీమ్‌ను ప్రకటించింది. మహిళా సమ్మాన్ యోజన ద్వారా మహిళలకు నెలనెలా రూ.2,100 ఆర్థికసాయం అందిస్తామని తెలిపింది. అర్చకులకు ప్రతినెలా రూ.18వేల గౌరవ వేతనం అందిస్తామని వెల్లడించింది. మొత్తం మీద జనాకర్షక హామీలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ఆప్ యత్నిస్తోంది.
Also Read :Golden Baba : 6 కేజీల బంగారు ఆభరణాలతో గోల్డెన్ బాబా.. మహాకుంభ మేళాలో సందడి
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇవీ..
- కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్(Free Electricity And Water) అందిస్తామని వెల్లడించింది.
- రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని తెలిపింది.
- ఉచిత రేషన్ కిట్లు ఇస్తామని పేర్కొంది.
- ఏడాదిపాటు నిరుద్యోగ యువతకు ప్రతినెలా రూ.8,500 అందిస్తామని తెలిపింది.
- మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థికసాయం అందిస్తామని వెల్లడించింది.
- రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
Also Read :Onions : మరోసారి ఉల్లీ ధరలకు రెక్కలు..కిలో ఎంతంటే..
బీజేపీ ఇచ్చిన హామీలు ఇవీ..
శుక్రవారం రోజు సంకల్ప్ పత్ర పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన బీజేపీ సైతం ఉచిత హామీలను ప్రకటించింది. గర్భిణులకు రూ.21వేల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. పేద కుటుంబాలకు సబ్సిడీపై రూ.500కే ఎల్పీజీ సిలిండర్లు ఇస్తామని పేర్కొంది. ‘మహిళా సమృద్ధి యోజన’తో మహిళలకు నెలకు రూ.2500 ఆర్థికసాయం అందిస్తామని వెల్లడించింది.