Environmental: ఢిల్లీలోని గీతా కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని యమునా ఖాదర్ ప్రాంతంలో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి హైవోల్టేజీ విద్యుత్ స్తంభాన్ని ఎక్కాడు. పర్యావరణ పరిరక్షణ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడాలని ఆ వ్యక్తి డిమాండ్ చేశాడు. “ఉదయం 10.30 గంటలకు, హై టెన్షన్ వైర్ పిల్లర్ పైకి ఎక్కిన వ్యక్తి గురించి మాకు కాల్ వచ్చింది. అతను పర్యావరణ పరిరక్షణ సమస్యపై ప్రధాని, సిఎం మరియు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌తో మాట్లాడేందుకు తనను అనుమతించాలని డిమాండ్ చేశాడు. మొదట అతను ఎక్కడున్నాడో స్పష్టంగా తెలియలేదు. అతను వివిధ విషయాలు చెబుతూనే ఉన్నాడు” అని ఢిల్లీ ఫైర్ సర్వీస్, ADO యశ్వంత్ సింగ్ మీనా అన్నారు.
ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. చివరకు ఆ వ్యక్తిని హైటెన్షన్ విద్యుత్ స్తంభం పైనుంచి కిందకు దించారు. తాను టీచర్ అని ఆ వ్యక్తి తెలిపాడని, కాసేపు బెంగాల్, ఆ తర్వాత బీహార్‌కు చెందినట్లుగా అతడు చెప్పాడని పోలీస్ అధికారి తెలిపారు. అయితే అతడు ఏ ప్రాంతం వాడు, ఎందుకు ఇలా చేశాడన్న దానిపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఆ వ్యక్తి హైటెన్షన్ కరెంట్ పోల్ పైకి ఎక్కిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా, దేశ రాజధానిలో గాలి, నీటి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ సంఘటన కలకలం రేపింది.