No Diesel : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు మరో కీలక చర్యకు తెరలేపారు అధికారులు. కాలం చెల్లిన వాహనాలకు ఇకపై ఇంధనం అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, జూలై 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఈ నిబంధనల ప్రకారం, 10 ఏళ్లను దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్ల పైనున్న పెట్రోల్ వాహనాలకు ఢిల్లీలోని ఏ ఫ్యూయల్ స్టేషన్ వద్ద కూడా ఇకపై ఇంధనం లభించదు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఇది కీలక చర్యగా భావిస్తున్నారు.
ఈ విధానాన్ని అమలు చేయడానికి అధికారులు ఇప్పటికే 500 ఇంధన కేంద్రాల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 3.63 కోట్ల వాహనాలను స్కాన్ చేయగా, 5 లక్షల కాలం చెల్లిన వాహనాలను గుర్తించారు. ఇకపోతే 29.52 లక్షల వాహన యజమానులు తమ పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్లను నవీకరించుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ. 168 కోట్ల విలువైన జరిమానాలు విధించారు.
ఇందులో భాగంగా, నిబంధనల అమలును పటిష్టం చేసేందుకు ఢిల్లీ రవాణాశాఖ 100 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఈ బృందాలు డేటాను విశ్లేషించి, నిబంధనలు విస్మరిస్తున్న వాహనదారులపై చర్యలు తీసుకుంటాయి.
ఇలాంటి మార్గదర్శకాలను ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో కూడా అమలు చేయనున్నారు. గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధనగర్, సోనిపట్‌లలో ఈ నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుండగా, మిగిలిన ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో 2026 ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తాయి. ఈ చర్యల ద్వారా కాలుష్య స్థాయిని గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు నమ్ముతున్నారు.