ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Delhi Election Counting) శనివారం ఉదయం 08 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 70 స్థానాలు కలిగిన ఈ రాజధానిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 36 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. బీజేపీ (BJP) ఈసారి 50 సీట్లతో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తుంటే, వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నమ్మకంగా ఉంది. ఈ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా మారిన నేపథ్యంలో ఢిల్లీ ఓటరు తుది తీర్పు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. గత రెండు ఎన్నికల్లో ఆప్ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో విద్య, ఆరోగ్యం, ఉచిత సేవలు వంటి కార్యక్రమాలు అమలు చేసి ప్రజల్లో విశ్వాసాన్ని చూరగొన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ, దేశవ్యాప్తంగా తమ విజయ పరంపరను కొనసాగిస్తూ, ఈసారి ఢిల్లీలోనూ అధికారాన్ని కైవసం చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీ విజయాన్ని సూచించినప్పటికీ, అసలు ఫలితాలు వచ్చే వరకు ఉత్కంఠ కొనసాగుతుంది.
PM Modi : ప్రధాని మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన ఖరారు..
ఢిల్లీలో ఒకప్పుడు కాంగ్రెస్‌కు అత్యంత బలమైన పట్టుంది. 1998 నుంచి 2013 వరకూ వరుసగా 15 ఏళ్లపాటు కాంగ్రెస్ అధికారం చలాయించింది. అయితే, 2013 తర్వాత ఆప్ వేగంగా ఎదిగి కాంగ్రెస్‌ను పూర్తిగా బలహీనపరిచింది. ఈసారి కనీసం కొన్ని సీట్లు గెలిచి పరువు కాపాడుకోవాలన్నది కాంగ్రెస్ లక్ష్యం. అయితే, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రస్తుత పోటీని తట్టుకుని విజయం సాధించగలరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఊహించినట్లుగానే ఫలితాలు ఉంటాయా? లేక ఢిల్లీ ఓటర్లు మరోసారి ఆశ్చర్యం పంచుతారా? అనే ప్రశ్నలకు సమాధానం కాసేపట్లో లభించనుంది. గత ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రావడం, ఆప్ పార్టీ విపరీతమైన మెజారిటీ సాధించడం మనకు తెలిసిందే. ఈసారి కూడా ప్రజలు స్థానిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి ఆప్‌కు పట్టం కడతారా? లేక జాతీయ రాజకీయాల ప్రభావంతో బీజేపీకి అవకాశమిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఉదయం 11 గంటల వరకు గెలుపు ఎవరిదన్నది ఓ క్లారిటీ రానుంది.