Arvind Kejriwal : ప్రతిపక్ష నేతలను జైలుకు పంపి రాజకీయాల్లో నెగ్గుకు రావాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ‘‘ఇప్పుడు ఆప్ ప్రభుత్వంలోని మంత్రులు, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ ప్రభుత్వంలోని మంత్రులు జైల్లో ఉన్నారు. ఈసారి బీజేపీ గెలిస్తే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కేరళ సీఎం పినరయి విజయన్, శివసేన నేత ఉద్ధవ్ థాక్రే కూడా జైలుకు వెళ్తారు’’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ‘‘బీజేపీ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజే, ఎంఎల్ ఖట్టర్, రమణ్ సింగ్‌ల రాజకీయాలకు మాత్రం ఎలాంటి ఆటంకం కలగదు. ఎందుకంటే వాళ్లంతా బీజేపీ’’ అని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) శనివారం సాయంత్రం బెయిల్ పై విడుదలవగా.. తాజాగా శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. 50 రోజుల తర్వాత మీడియాతో ఉండటం చాలా గొప్పగా అనిపిస్తోందన్నారు. దేశంలో బీజేపీ అరాచక పాలనను అంతం చేయడమే తన లక్ష్యమన్నారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘నాకు సీఎం పదవి ముఖ్యం కాదు. మనదేశంలో గత 75 ఏళ్లలో చాలా ఎన్నికలు జరిగాయి. ఢిల్లీలో మునుపెన్నడూ లేని విధంగా ఆప్ అత్యధిక ఓట్లతో గెలిచింది. ఇంత మెజారిటీతో ఆప్ గెలిచిన తర్వాత.. ఢిల్లీలో బీజేపీ గెలవడం అసాధ్యమని వాళ్లకు తెలుసు. అందుకే నన్ను అరెస్టు చేశారు. నా అరెస్టు తర్వాత ప్రభుత్వం పడిపోతుందని భావించారు. నా దేశం కోసం 100 సీఎం పదవులను వదులుకునేందుకైనా రెడీ’’ అని సీఎం కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. కేంద్రంలోని నిరంకుశ మోడీ సర్కారును కూల్చే దాకా తన పోరాటం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ పాలనలో దేశం ఎంతో నష్టపోయిందని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు.