Firecrackers Ban In Delhi : ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కీలక ప్రకటన చేశారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకుగానూ వచ్చే ఏడాది జనవరి 1 వరకు గ్రీన్ క్రాకర్స్ సహా అన్ని బాణసంచాల తయారీ, అమ్మకం, వినియోగంపై బ్యాన్ విధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చలికాలంలో ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని.. బాణాసంచా పేల్చడం వల్ల అది మరింతగా పెరుగుతోందన్నారు. అందుకే గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకం, వినియోగంపై పూర్తి నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు గోపాల్ రాయ్ చెప్పారు. దీనివల్ల ఢిల్లీ ప్రజలకు కాలుష్యం నుంచి రక్షణ లభిస్తుందన్నారు. ఆన్‌లైన్‌లో లేదా ప్రత్యక్షంగా పటాకుల డెలివరీ, అమ్మకాలపై బ్యాన్ అమల్లో ఉంటుందన్నారు. దీపావళి పండుగను ప్రజలు దీపాలు వెలిగించి, మిఠాయిలు పంచి జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. మనం పండుగను ఆడంబరంగా జరుపుకోవాలే కానీ.. కాలుష్యం వెదజల్లేలా(Firecrackers Ban In Delhi) జరుపుకోవద్దన్నారు.
Also Read :Jayam Ravi : విడాకుల లిస్ట్ లో మరో హీరో.. భార్యతో విడిపోయిన తమిళ హీరో..
ఈ బ్యాన్‌ను కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, రెవెన్యూ శాఖలతో కలిసి సంయుక్త కార్యాచరణ ప్రణాళికను త్వరలో రూపొందిస్తామని గోపాల్ రాయ్ తెలిపారు. పటాకుల విషయంలో ప్రజల్లో ఎలాంటి గందరగోళం ఉండకూడదని, ఈ నిషేధం అన్ని రకాల బాణసంచాలకు వర్తిస్తుందన్నారు. ఈ నిషేధం జనవరి 1, 2025 వరకు ఢిల్లీలో అమలులో ఉంటుందని తెలిపారు. చివరి నిమిషంలో దీనిపై ప్రకటన చేస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో.. తాము ముందుగానే బాణసంచా వినియోగంపై బ్యాన్ విధించే ప్రకటన చేశామని ఆయన చెప్పారు. 21 పాయింట్ల వింటర్ యాక్షన్ ప్లాన్‌లో భాగమైన పటాకులను నిషేధించడంలో ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా చాలా చురుకుగా వ్యవహరిస్తోందన్నారు.