Site icon HashtagU Telugu

Ram Lalla : బాలరాముడి విగ్రహం ఎంపిక పూర్తి.. వివరాలివీ..

Ram Lalla

Ram Lalla

Ram Lalla : అయోధ్య రామమందిరం గర్భగుడిలో జనవరి 22న ప్రతిష్ఠించనున్న బాలరాముడి విగ్రహం ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది. ప్రత్యేకంగా తయారు చేయించిన బాల రాముడి మూడు విగ్రహాలపై శుక్రవారం జరిగిన ఓటింగ్‌‌లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ మూడింటిలో అత్యుత్తమంగా కనిపించే ఒక విగ్రహాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ధర్మకర్తల మండలి ఎంపిక చేసింది. దీనిపై తమ అభిప్రాయాన్ని ట్రస్ట్‌కు లిఖితపూర్వకంగా అందజేసింది. అయితే దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. మూడు విగ్రహాలను పరిశీలించిన టీమ్‌లో రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా సహా మొత్తం 11 మంది ఉన్నారు. వీరు తీసుకున్న నిర్ణయాన్ని రామాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌కు అందజేశారు.

We’re now on WhatsApp. Click to Join.

దీనిపై తుది నిర్ణయాన్ని ట్రస్ట్ ఛైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ తీసుకుంటారని ఆలయ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి వెల్లడించారు. ‘‘మూడు విగ్రహాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. ప్రాణ ప్రతిష్ఠా వేడుక కోసం ఒకదాన్ని ఎంపిక చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ’’ అని  ఆయన తెలిపారు. విగ్రహాన్ని ఖరారు చేసే తేదీని ట్రస్ట్ ఇంకా ప్రకటించలేదన్నారు. ఈ మూడు విగ్రహాలలో ఒకదాన్ని రామాలయం గర్భగుడిలో, మిగతా రెండింటిని ఆలయంలోని మొదటి, రెండో అంతస్తులలో ప్రతిష్ఠిస్తామని(Ram Lalla) తెలిపారు.

Also Read: Inside Story : బిహార్ సీఎంను డిప్యూటీ సీఎంగా చేసేందుకు స్కెచ్.. లలన్ సింగ్ ఔట్ !?

కర్ణాటకకు చెందిన ప్రఖ్యాత శిల్పులు గణేష్ భట్, అరుణ్ యోగిరాజ్, రాజస్థాన్‌కు చెందిన శిల్పి సత్య నారాయణ్ పాండే రామ్ లల్లా మూడు విగ్రహాలను చెక్కారు. విగ్రహాల తయారీకి కర్ణాటక శిల్పులు నల్లరాళ్లను ఉపయోగించగా.. రాజస్థాన్‌ శిల్పి తెల్లని మకరానా పాలరాయిని వాడారు. ముంబైకి చెందిన ప్రముఖ కళాకారుడు వాసుదేవ్ కామత్ సమర్పించిన స్కెచ్ ఆధారంగా రామ్ లల్లా విగ్రహాలను రూపొందించారు. బాలరాముడి విగ్రహాలు 51 అంగుళాల హైట్‌తో ఉంటాయి. గర్భగుడిలో ప్రతిష్ఠించే విగ్రహాన్ని భక్తులు 35 అడుగుల దూరం నుంచే దర్శించుకునే వీలు ఉంటుంది. అయోధ్య రామాలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జనవరి 16 నుంచి మొదలుకానున్నాయి. 17న బాల రాముడి విగ్రహాన్ని అయోధ్యలో ఊరేగిస్తారు. జనవరి 20న సరయూ నదీజలాలతో రామమందిరాన్ని శుద్ధి చేస్తారు. అదే రోజు వాస్తు పూజలు నిర్వహిస్తారు. 21న బాల రాముడి విగ్రహం సంప్రోక్షణ ఉంటుంది. 22న ఉదయం పూజల అనంతరం మృగశిర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో బాల రాముడి విగ్రహాన్ని శాశ్వత ప్రతిష్ఠ చేయనున్నారు.