Election Assurances : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల హామీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ఎలాంటి హామీలను ప్రకటించవద్దని కాంగ్రెస్ నేతలకు మల్లికార్జున ఖర్గే సూచించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైనందుకు కర్ణాటక ప్రభుత్వాని ఖర్గే నిలదీశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు, ఏడు అంటూ ఎలాంటి గ్యారంటీలూ ప్రకటించడం లేదని స్పష్టం చేశారు. ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. ‘త్వరలో జరగబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో 5, 6, 10, 20 ఇలా ఏ ఒక్క హామీలను ప్రకటించడం లేదు. బడ్జెట్ ఆధారంగా హామీలు ప్రకటించాలి. లేదంటే రాష్ట్రం దివాలా పరిస్థితికి చేరుతుంది. ప్రణాళికా రహిత విధానం ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. భవిష్యత్తు తరాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. రోడ్లు వేసేందుకు కూడా డబ్బు లేకపోతే.. ప్రభుత్వంపై ప్రజలు ఎదురు తిరుగుతారు. ప్రభుత్వం విఫలమైతే భవిష్యత్తు తరానికి చెడ్డపేరు తప్ప మరొకటి మిగలదు’ అంటూ ఎన్నికల హామీలపై ఖర్గే వ్యాఖ్యానించారు.
మరోవైపు ఎన్నికల సమయంలో ప్రజలు ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పలు హామీలను ఇస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో ఐదు గ్యాంరటీలతో, తెలంగాణలో ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది. మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు సేవలను అందించే శక్తి పథకాన్ని సమీక్షిస్తామని కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ పథకాన్ని సమీక్షించబోమని కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి గురువారం తెలిపారు. ఈ నేపథ్యంలో, రాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీలపై వెనకడుగు వేస్తున్నట్లు భావిస్తున్నారు.
Read Also: CM Chandrababu : ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారభించిన సీఎం