Site icon HashtagU Telugu

Congress : పార్టీలో అంతర్గత ఐక్యతపై కాంగ్రెస్ దృష్టి

Congress Focus On Internal Unity In The Party

Congress Focus On Internal Unity In The Party

By: డా. ప్రసాదమూర్తి

Congress Internal Unity : అనుభవం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఎన్నికలు సమీపించిన వేళ ప్రజలకు కావలసిన అత్యంత ఆకర్షణీయమైన తాయిలాలను రూపొందించడంలో రాజకీయ పార్టీలు ఎవరికి అనువైన మార్గాలు వారు ఎంచుకుంటారు. కానీ ఇటీవల కాలంలో కేంద్రం నుంచి రాష్ట్రాల దాకా ప్రతి పార్టీ ప్రజలకు రకరకాల పథకాల ఆశ చూపించి ఓట్లు రాబట్టుకోవాలని తాపత్రయాన్నే ప్రదర్శిస్తున్నాయి. ఇందులో ఏ పార్టీకిఉ మినహాయింపు లేదు. హైదరాబాదులో సెప్టెంబర్ 16, 17 తేదీల్లో జరిగిన కాంగ్రెస్ (Congress) పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలు ప్రజల ముందుకు ఏ పథకాలతో వెళ్ళాలో కసరత్తులు బాగానే చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే అదంతా ఎన్నికల వ్యూహం కానీ, పార్టీ బలోపేతంగా లేకుంటే, కార్యకర్తల నుండి నాయకత్వ స్థానం వరకు పార్టీ క్రమశిక్షణతో దృఢమైన అచంచలమైన నిర్మాణంలో లేకపోతే ఆ పార్టీ ఎన్నికలలో విజయాలు సాధించలేదు. ఒకవేళ విజయాలు సాధించినా ఆ విజయం కలకాలం నిలబెట్టుకోలేదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బాగా అర్థం చేసుకున్నట్లు ఉంది.

కాంగ్రెస్ పార్టీకి ఇటీవల కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సాధించిన విజయం మరిన్ని రాష్ట్రాలలో ముందుకు దూసుకుపోవడానికి గొప్ప ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే కర్ణాటక అనుభవం కాంగ్రెస్ (Congress) పార్టీకి రెండు గుణపాఠాలు నేర్పింది. ఒకటి ప్రజలను తిరుగులేని విధంగా తమ వైపు ఆకట్టుకోవడానికి ఎదురులేని పథకాలను రచించాలి. ఆ సంక్షేమ పథకాల ఆశతో ప్రజలు ఉక్కిరిబిక్కిరై తమకు కచ్చితంగా ఓట్లు వేస్తారు. ఈ విషయాన్ని కర్ణాటక అనుభవం ద్వారా కాంగ్రెస్ పార్టీ గమనించింది. అయితే కర్ణాటక అనుభవం మరో పాఠం కూడా నేర్పింది. పార్టీ నాయకత్వంలో ఎలాంటి వైరుధ్యాలు ఉన్నా.. ఎలాంటి ఘర్షణ ఉన్నా.. అది సాధించిన విజయాన్ని మట్టిపాలు చేసుకునే ప్రమాదానికి దారితీస్తుంది.

ఈ విషయంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి కర్ణాటకలో గట్టి అనుభవమే ఎదురైంది. అయితే కాంగ్రెస్ పార్టీ హై కమాండ్, ఎన్నికల ముందు, ఎన్నికలలో విజయం తర్వాతా, కర్ణాటక పార్టీలో ఉన్న రెండు బలమైన శక్తులు సిద్ధరామయ్య, శివకుమార్ లను ఒక తాటిపై తీసుకురావడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. ఎంతో ఆందోళన పడాల్సి వచ్చింది. పార్టీలో గ్రూపులు, వ్యక్తిగత స్వార్థాలు పార్టీ కంటే ఎక్కువైనప్పుడు ఒక జాతీయ పార్టీగా దేశమంతటిని సమైక్యం చేయడం సాధ్యం కాదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కర్ణాటక అనుభవంతో గుర్తించింది. కర్ణాటకలో రెండే రెండు బలమైన వర్గాలు. వారిని బుజ్జగించి, ఇద్దరినీ సమైక్యపరచి, వచ్చిన ఫలితాన్ని కుక్కలు చింపిన విస్తరి కాకుండా కాపాడుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ.

కానీ తెలంగాణలో పరిస్థితి అలా కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష స్థానంలో ఉండి పార్టీని ముందుకు నడుపుతున్న యువ నాయకుడు రేవంత్ రెడ్డి ఒకవైపు ఉన్నాడు. పార్టీలో ఎన్నో ముఖ్య పదవులను, కీలక స్థానాలను దక్కించుకొని పనిచేసిన గత అనుభవం ఉన్న హేమాహేమీలైన వృద్ధ నాయకత్వం మరొకవైపు ఉంది. హనుమంతరావు, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి లాంటి హేమాహేమీలు పార్టీలో ఉండగా రేవంత్ రెడ్డి ముందుకు దూసుకుపోతున్న వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఈ వృద్ధ నాయకత్వం చాలాసార్లు మీడియా ముందుకు వచ్చి తమలో తామే విమర్శలు గుప్పించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో గతంలో పార్టీ హైకమాండ్ నుంచి నాయకులు ఇక్కడికి వచ్చి కొద్దిగా చీవాట్లు పెట్టి వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు కొత్త సిడబ్ల్యుసి తొలి సమావేశం హైదరాబాదులో జరిగింది.

కర్ణాటక ఫలితాల ఉత్తేజంతో తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ అన్ని రకాల వ్యూహాలూ రచిస్తోంది. ప్రజాదరణ కూడా పెరిగిన సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీ నుంచి బిజెపి నుంచి నాయకుల ప్రవాసం కాంగ్రెస్ పార్టీలోకి ప్రవాహంగా మొదలైంది. రాను రాను వాతావరణం కాంగ్రెస్ కి తెలంగాణలో అనుకూలంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏమంత క్షేమం కాదు. అందుకే పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్న అనేక కీలకమైన నిర్ణయాలు, తీర్మానాలు అలా ఉంచితే, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు చేసిన హితబోధ చాలా కీలకమైంది. ఆయన పార్టీలో వ్యవస్థాగత ఐక్యత అన్నింటికంటే అతి ప్రధానమైనదని నాయకులకు బోధించారు.

పార్టీలో అంతర్గత ఐక్యత లేకుండా మనం ఏమీ సాధించలేమని ఆయన చాలా సుదీర్ఘమైన తన ప్రసంగంలో మళ్లీ మళ్లీ పార్టీ ఐక్యత గురించి నొక్కి వక్కాణించారు. ఇతర రాష్ట్రాల్లో నాయకత్వ పోరు ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మధ్య ఉంటుంది. తెలంగాణలో అలా కాదు. ఇక్కడ పార్టీలో అంతర్గతంగా అనైక్యత చాలా ఉందని హై కమాండ్ గుర్తించినట్టుగా కనిపిస్తోంది. చూడాలి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యువనేత రేవంత్ రెడ్డి వెనక ఎంత బలంగా నిలుస్తుందో.. ఆ ఐక్యత ఎన్నికల్లో విజయానికి ఎంతగా తోడ్పడుతుందో.

Also Read:  CM Jagan : తిరుపతిలో శ్రీనివాససేతు ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌

Exit mobile version