Congress : కాంగ్రెస్, సపా మధ్య వివాదం.. విపక్షాల ఐక్యతకు ప్రమాదం

కర్ణాటక (Karnataka) విజయోత్సవంతో కాంగ్రెస్ నూతనోత్తేజంతో ముందుకు వెళుతోంది. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికలకు, ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు సెమీఫైనల్స్ గా భావిస్తే, ప్రతిపక్షాల మధ్య ఐక్యత ఆచరణలో ఇప్పుడే కనిపించాలి కదా

  • Written By:
  • Publish Date - October 21, 2023 / 08:46 PM IST

అందరూ ఊహిస్తున్నట్టుగానే సీట్ల షేరింగ్ దగ్గరకు వచ్చేసరికి విపక్షాల మధ్య ఐక్యత ఎంత ఉందో తెలిసి వచ్చింది. మాటల్లో కనిపించిన ఐక్యత, సమావేశాల్లో చూపించిన ఉత్సుకత కాంగ్రెస్ (Congress Party), ఇతర ప్రతిపక్షాల చేతల్లో కనిపించడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. మరి ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇతర ప్రతిపక్షాలకు సయోధ్య ఎలా కుదురుతుంది అనేదే మొదటి నుంచి రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న అనుమానాలు ఇప్పుడు నిజమవుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల (5 States) ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మంచి దూకుడుగా దూసుకుపోతోంది. కర్ణాటక (Karnataka) విజయోత్సవంతో కాంగ్రెస్ నూతనోత్తేజంతో ముందుకు వెళుతోంది. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికలకు, ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు సెమీఫైనల్స్ గా భావిస్తే, ప్రతిపక్షాల మధ్య ఐక్యత ఆచరణలో ఇప్పుడే కనిపించాలి కదా. తాము కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని దాని మిత్రపక్షాలను ఉమ్మడిగా ఢీకొంటామని, ఈ పోరాటంలో సీట్ల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనుసరిస్తామని ఇప్పటివరకు జరిగిన సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ గాని ఇతర ప్రతిపక్షాలు గాని చెప్తూ వచ్చాయి. ఆ మాటలు ఆచరణలో నిరూపించుకోవాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. కానీ మాటలు వేరు ఆచరణ వేరు అనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ కి సమాజ్ వాది పార్టీ (Samajwadi Party)కి మధ్య పొత్తు కుదిరిందని వార్తలు వచ్చాయి. కానీ అంతలోనే కాంగ్రెస్ పార్టీ తన పట్టాన తాను ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించింది. తమకు తొమ్మిది స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ముందు ఒప్పందం కుదుర్చుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట తప్పుతుందని, ఇదే విధానం కొనసాగితే ఇక ప్రతిపక్షాల మధ్య దేశవ్యాప్తంగా ఐక్యత ఎలా కొనసాగుతుందని సమాజ్ వాది పార్టీ అధినాయకుడు అఖిలేష్ యాదవ్ విమర్శిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అఖిలేష్ యాదవ్ వాదన ప్రకారం గతంలో మధ్యప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో తమకు గణనీయమైన సీట్లు వచ్చాయని, 2018 ఎన్నికల్లో కూడా ఒక సీట్లో గెలిచినా, కొన్ని సీట్లలో రెండవ స్థానంలో ఉన్నామని, తమ ప్రాధాన్యతను కాంగ్రెస్ గుర్తించలేదని, ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనుసరించి ఇతర ప్రతిపక్షాలకు కూడా కాంగ్రెస్ తన పోరాటంలో చోటిస్తే, అదే పద్ధతిలో ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ కి చోటు దొరుకుతుందని అఖిలేష్ యాదవ్ అంటున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సమావేశాల్లోనూ, తదనంతరం జరిగిన పత్రికా విలేకరుల సమావేశాల్లోనూ చెప్పింది ఒకటి, ఇప్పుడు వాస్తవంగా చేస్తున్నది ఒకటి అని ఆయన తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడుతున్నారు. మధ్యప్రదేశ్లో తాము పోటీలో ఉంటామని ఇప్పటికే సమాజ్ వాది పార్టీ 22 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 44 మంది అభ్యర్థులను ప్రకటించింది. అంటే ఈ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి, వీరికీ మధ్య పోటీ జరుగుతుంది. ఈ వాతావరణం ఇలాగే కొనసాగితే ప్రతిపక్షాల మధ్య సయోధ్య అనేది నేతి బీరకాయలో నేయి లాంటిదే అని అధికార బిజెపితో పాటు మిగిలిన వారంతా ఎద్దేవా చేయడానికి గొప్ప అవకాశం ఇచ్చినట్టే.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ వాదన మరొకలా ఉంది. బిజెపి వ్యతిరేక ప్రతిపక్షాల కూటమి ఇండియా ప్రధాన ధ్యేయం సార్వత్రిక ఎన్నికలేనని, దేశవ్యాప్త ఎన్నికలలో ప్రతిపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో అవగాహన ఉంటుందని, రాష్ట్రాల ఎన్నికలకు అది వర్తించదని కాంగ్రెస్ పార్టీ వారు అంటున్నారు. ఇదే నిజమైతే రేపు సార్వత్రిక ఎన్నికలలో కూడా సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ ఎక్కడ ప్రధానంగా ఉంటుందో అక్కడ ప్రతిపక్షాలతో పేచీ రావడం తథ్యం. కేవలం రాష్ట్రాల ఎన్నికలతో సరిపోదు. దేశవ్యాప్త ఎన్నికలలో కూడా ప్రధాన ప్రతిపక్షాల కూటమి ఇండియాలో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సర్దుబాటు జరగాలి. అలా జరగడానికి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలలో అనుకూలమైన సంకేతాలను కాంగ్రెస్ తోపాటు ఇతర ప్రతిపక్షాలు దేశానికి అందించాలి.

ప్రస్తుత వాతావరణం చూస్తే కాంగ్రెస్ కి, సమాజ్వాది పార్టీకి మధ్య జరుగుతున్న రగడ ఇండియా కూటమిలో ఐక్యతకు పెద్ద ప్రమాదంగా దారి తీసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆశయం ఎంత గొప్పదైనా, ఆచరణలో చిత్తశుద్ధి కనపడాలి. ప్రస్తుతం లేని ఐక్యత సార్వత్రిక ఎన్నికలలో మాత్రం ఎలా వస్తుంది అనే ప్రశ్నకు కాంగ్రెస్ దగ్గర గాని ఇతర ప్రతిపక్షాల దగ్గర గాని సమాధానం ఉందా అంటే లేనట్టుగానే కనిపిస్తుంది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. అలాంటి సందర్భంలో అక్కడ పోటీకి దిగుతున్న సమాజవాది పార్టీ గాని, ఆమ్ ఆద్మీ పార్టీ గాని సందర్భాన్ని అనుసరించి, సమయాసమయాలు పాటించి, వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. కానీ అదును దొరికింది కదా అని అధికంగా సీట్లు కాంక్షిస్తే, అది కాంగ్రెస్ కి సాధ్యమయ్యే పని కాదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ఇతర ప్రతిపక్షాలు కూడా ఇచ్చి పుచ్చుకునే ధోరణి చిత్తశుద్ధితో పాటించాలి. కానీ మధ్యప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, సమాజ్వాది పార్టీకి మధ్య చెలరేగిన చిచ్చు రానున్న కాలంలో ప్రతిపక్షాల ఐక్యతకు ఎలాంటి ప్రమాదం తెచ్చి పెడుతుందో అన్న అనుమానాలే ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. దీన్ని మొగ్గలోనే తుంచి, ప్రతిపక్షాలు తమ ఐక్యతను చాటుకుంటాయా.. ఇప్పుడు బీటలు వారిన ఐక్యత రానున్న కాలంలో అగాథంగా మారకుండా జాగ్రత్త పడతాయా.. మరి ఏం చేస్తాయో ఎదురు చూడాల్సిందే.

Read Also : Hyderabad Metro : మెట్రోకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ ఫైన్