AI Summit 2026 : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్ 2026’ లో అపశ్రుతులు దొర్లడం చర్చనీయాంశమైంది. ప్రపంచ దేశాల నుంచి దిగ్గజ టెక్ నిపుణులు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వంటి ప్రముఖులు హాజరవుతున్న ఈ సదస్సులో నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భద్రతా పరమైన కారణాలతో ప్రతినిధుల మధ్య గందరగోళం నెలకొంది. సాంకేతిక ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయాల్సిన వేదికపై, సమన్వయ లోపం వల్ల ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సదస్సులో తమ వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు వచ్చిన ఒక స్టార్టప్ ఫౌండర్‌కు ఊహించని షాక్ తగిలింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో, భద్రతా సిబ్బంది సూచనల మేరకు తమ ప్రదర్శన గది (Stall)లో డివైజ్‌లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. అయితే, ప్రధాని విజిట్ ముగిసిన తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి, లక్షల విలువైన ఆ డివైజ్‌లు మాయమైనట్లు సదరు ఫౌండర్ వాపోయారు. అత్యున్నత స్థాయి భద్రత ఉండే ప్రధాని పర్యటన సమయంలోనే వస్తువులు చోరీకి గురవ్వడం, సదస్సు భద్రతా ఏర్పాట్లపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది.
కేవలం దొంగతనాలే కాకుండా, సదస్సులో జనసమూహాన్ని నియంత్రించడంలో (Crowd Management) కూడా నిర్వాహకులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల దగ్గర గంటల తరబడి వేచి చూడాల్సి రావడం, సరైన సమాచారం ఇచ్చే సిబ్బంది లేకపోవడంతో అంతర్జాతీయ ప్రతినిధులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏఐ వంటి అత్యాధునిక అంశంపై జరుగుతున్న సదస్సులో కనీసం ప్రాథమిక ఏర్పాట్లు కూడా సరిగా లేకపోవడంపై టెక్ వర్గాలు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
