Colonel Sofiya Qureshi : భారత సైన్యంలో సేవలందిస్తున్న కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. “ఉగ్రవాదుల సోదరి” అని ఆమెను మంత్రి పేర్కొనడంపై దేశమంతటా కలకలం రేగింది. ఈ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనిని సుమోటోగా తీసుకున్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించగా, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన విచారణలో న్యాయస్థానం మంత్రి క్షమాపణలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. “క్షమాపణలు ఎక్కడ, ఎలా చెప్పారు? మీ మాటల్లో మనస్ఫూర్తి లేదు. ఇది కేవలం న్యాయ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది” అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. క్షమాపణలు చెప్పడం ఓ ఫార్మాలిటీ కాకుండా, బాధ్యతతో కూడిన చర్య అయి ఉండాలి అని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాక..మంత్రి క్షమాపణలను అంగీకరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Read Also: Hyderabad Blasts Plan : గ్రూప్ 2 కోచింగ్ కోసం వచ్చి.. ఉగ్రవాదం వైపు మళ్లిన యువకుడు
ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తగా, సుప్రీంకోర్టు మంత్రి విజయ్ షా వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రతి పదాన్ని బాధ్యతగా వాడాలి. మీరు మాట్లాడిన విధానం దేశానికి అపకీర్తిని తీసుకొచ్చింది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు మంత్రి వ్యాఖ్యలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ఉదయం 10 గంటల్లోపు సిట్‌ను ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది. ఈ బృందంలో రాష్ట్రానికి చెందని ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉండాలని, వారిలో కనీసం ఒకరు ఎస్పీ ర్యాంక్ కలిగిన మహిళా అధికారి కావాలని సూచించింది. అయితే, ప్రస్తుతానికి మంత్రి అరెస్టుపై కోర్టు స్టే విధించింది. కానీ విచారణకు పూర్తిగా సహకరించాల్సిందేనని స్పష్టం చేసింది. మంత్రి వైఖరి విచారకరం అని, సైనిక అధికారిణిపై వ్యక్తిగత దూషణలు చేసిన తీరును న్యాయస్థానం తూర్పారపడింది. ఈ సంఘటన దేశ ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. దేశ రక్షణ కోసం పని చేసే సైనికులపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ మన్నించదగినవి కావని, ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం హితవు పలికింది.