China Vs Bhutan : భూటాన్‌లోకి చైనా చొరబాటు.. ఇండియా అలర్ట్

China Vs Bhutan : భూటాన్ సరిహద్దుల్లో చైనా సైన్యం యాక్టివిటీని పెంచింది.

  • Written By:
  • Updated On - December 11, 2023 / 12:34 PM IST

China Vs Bhutan : భూటాన్ సరిహద్దుల్లో చైనా సైన్యం యాక్టివిటీని పెంచింది. భూటాన్ బార్డర్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని జకర్లుంగ్ లోయలో రెండు, మూడు చోట్ల  భారీగా సైనిక శిబిరాలను నిర్మించింది.  ఒకచోట 129 భవనాలను, మరో 62 భవనాలను నిర్మించింది. ఈ ఏరియాలలో సైనిక మోహరింపును కూడా గత రెండేళ్లలో గణనీయంగా పెంచింది. దీనికి సంబంధించిన శాటిలైట్ ఫొటోలను తాజాగా ‘మాక్సార్ సంస్థ’ విడుదల చేయడంతో దానిపై వాడివేడి చర్చ మొదలైంది. వాస్తవానికి జకర్లుంగ్ లోయ అనేది భూటాన్ ఉత్తర ప్రాంతం పరిధిలోకి వస్తుంది. బార్డర్‌లో చైనా దురాక్రమణను నిలువరించగల సైనిక సామర్థ్యం భూటాన్‌కు లేదు. దీంతో అక్కడ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈనేపథ్యంలో చైనా ఎదుట భూటాన్ స్నేహ హస్తం చాచింది.  తొలిసారిగా ఈ ఏడాది అక్టోబర్‌లో భూటాన్ విదేశాంగ మంత్రి తండి దోర్జీ చైనాలో(China Vs Bhutan) పర్యటించారు. సరిహద్దుల్లో సైన్యం యాక్టివిటీని తగ్గించాలని చైనాను ఆయన కోరారు. ఓ వైపు భూటాన్ చర్చలకు సిద్ధంగా ఉన్నా.. చైనా మాత్రం భూటాన్ బార్డర్‌లో యాక్టివిటీని కొనసాగించడం దాని దురాక్రమణ వాదానికి అద్దంపడుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

2017 సంవత్సరంలో భూటాన్‌లోని డోక్లామ్ భూభాగం విషయంలో భారత్‌, చైనా మధ్య సైనిక ప్రతిష్టంభన నడిచింది.  డోక్లామ్‌లో భారతదేశం, చైనా సైన్యాల మధ్య రెండు నెలల పాటు ఘర్షణ నడిచింది. ఆ ప్రాంతంలో చైనా అక్రమంగా నిర్మిస్తున్న రహదారిని భారత దళాలు భౌతికంగా నిరోధించాయి. భూటాన్‌కు సైనిక సాయం చేసేందుకు భారత ఆర్మీ భూటాన్‌లోని డోక్లామ్‌కు ఆనాడు వెళ్లింది. ఈనేపథ్యంలో భూటాన్‌పై ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతోనే 2021 సంవత్సరం నుంచి భూటాన్ బార్డర్‌కు సమీపంలోని జకర్లుంగ్ లోయలో చైనా సైన్యం మోహరింపును పెంచడం ప్రారంభించింది.

Also Read: CM Revanth Reddy Meets Jana Reddy : జానారెడ్డి ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

భూటాన్ అనేది భారత్‌కు చెందిన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అత్యంత సమీపంలో ఉంటుంది. అక్కడ చోటుచేసుకునే ప్రతి సైనిక యాక్టివిటీ భారత్‌కు ఎంతో కీలకం. అందుకే ఈ పరిణామాలను  భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. భూటాన్‌లో చైనా ఆర్మీ ఇంకా ఏమేం చేయబోతోంది ? దాని తదుపరి వ్యూహం ఏమిటి ? అనేది భారత్ ఆసక్తికరంగా గమనిస్తోంది.