Site icon HashtagU Telugu

Cough Syrups: దగ్గు సిరప్‌ ల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచి కొత్త రూల్..!

Cough Syrups

Cough Syrup

Cough Syrups: భారతీయ దగ్గు సిరప్‌ (Cough Syrups)లపై గతంలో లేవనెత్తిన ప్రశ్నల తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విచారణ, రుజువు లేకుండా దగ్గు సిరప్‌ (Cough Syrups)ను ఎగుమతి చేయలేమని నోటిఫికేషన్‌లో పేర్కొంది. నోటిఫికేషన్ ప్రకారం.. ఎగుమతి చేయవలసిన ఉత్పత్తి నమూనా ప్రభుత్వ ల్యాబ్‌లో పరీక్షించబడుతుంది. దీని తర్వాత మాత్రమే దగ్గు సిరప్‌ను ఎగుమతి చేసేందుకు అనుమతిస్తారు. జూన్ 1 నుండి దగ్గు సిరప్ కోసం కొత్త విధానం అమలులోకి వస్తుందని నోటిఫికేషన్‌ లో పేర్కొంది.

దగ్గు సిరప్ కంపెనీలు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అనుమతిని పొందే ముందు జూన్ 1 నుండి నియమించబడిన ప్రభుత్వ ప్రయోగశాలలలో పరీక్షించవలసి ఉంటుంది. భారతీయ సంస్థలు ఎగుమతి చేసే దగ్గు సిరప్ నాణ్యతపై తలెత్తుతున్న ప్రశ్నల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Also Read: Rahul Gandhi Truck Ride: ట్రక్కు డ్రైవర్ గా మారిన రాహుల్

దగ్గు సిరప్ నమూనాలను ప్రభుత్వ లాబొరేటరీలలో తప్పనిసరిగా పరీక్షిస్తారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తెలిపింది. పరీక్ష సర్టిఫికేట్ పొందిన తర్వాత మాత్రమే విదేశాలకు ఎగుమతి చేయడానికి అనుమతించబడుతుంది. అనేక నగరాల్లో ఉన్న ప్రాంతీయ ఔషధ పరీక్షా ప్రయోగశాల, కోల్‌కతాలోని సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీ, సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీలలో నమూనాలను పరీక్షించనున్నారు. ఇది కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తించబడిన డ్రగ్ టెస్టింగ్ లేబొరేటరీలలో కూడా నమూనాలను పరీక్షించవచ్చు.

ఇండియన్ దగ్గు సిరప్ గురించి డబ్ల్యూహెచ్‌ఓ అలర్ట్ జారీ

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గత ఏడాది భారతదేశంలో నాలుగు దగ్గు, జలుబు సిరప్‌ల గురించి హెచ్చరిక జారీ చేసింది. ఈ దగ్గు సిరప్‌లు తాగి గాంబియాలో చాలా మంది చనిపోయారు. దీని వల్ల కిడ్నీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. అదే సమయంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఈ దగ్గు సిరప్‌లపై దర్యాప్తు ప్రారంభించింది. ఇటీవల ఉజ్బెకిస్తాన్ కూడా ఇండియన్ దగ్గు సిరప్ గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తింది. సిరప్ తాగి దాదాపు 18 మంది చిన్నారులు చనిపోయారని ఉజ్బెకిస్థాన్ ఆరోపించింది.