Anti Paper Leak Law : అమల్లోకి ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ – 2024’.. పేపర్ లీకులకు చెక్

నీట్, నెట్ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకుల వ్యవహారాలు దేశంలో కలకలం రేపుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Anti Paper Leak Law

Anti Paper Leak Law : నీట్, నెట్ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకుల వ్యవహారాలు దేశంలో కలకలం రేపుతున్నాయి. ఈతరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్)యాక్ట్-2024’ను జూన్ 21 (శుక్రవారం) నుంచే  అమల్లోకి తీసుకొచ్చింది.ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర సర్కారు విడుదల చేసింది. ఇకపై పేపరు లీకేజీలకు కారణమయ్యే వారిపై దీని ప్రకారమే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. పేపర్ లీకుల నిరోధానికి(Anti Paper Leak Law) న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ ప్రకటించిన 24 గంటల్లోపే ‘ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-2024’ను అమల్లోకి తేవడం గమనార్హం. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌, ఎన్‌డీఏ తదితర పోటీ పరీక్షలతో పాటు నీట్‌, జేఈఈ, సీయూఈటీ వంటి ఎంట్రన్స్‌ టెస్టులకూ ఈ చట్టం వర్తిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join

ఈ చట్టంలో ఏముంది ?

  • చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశపరీక్ష కార్డులు జారీ చేసినా నేరమే.
  • పేపర్ లీక్ కేసుల్లో దోషులుగా తేలే వారికి మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది.
  • పేపర్ లీక్ వ్యవహారాల్లో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారికి ఐదు నుంచి పదేళ్ల జైలుశిక్ష పడుతుంది. రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు. ఈ నేరానికి పాల్పడిన వారి ఆస్తులనూ జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చును కూడా వారి నుంచే వసూలు చేస్తారు.
  • పేపర్‌ లీకేజీకి పాల్పడినా, మాల్‌ ప్రాక్టీస్‌ చేసినా, పరీక్షలకు సంబంధించిన నకిలీ వెబ్‌సైట్లు తెరిచినా గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు.
  • పరీక్షల నిర్వహణ బాధ్యతలను చేపట్టే సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు పేపర్ లీక్ చేసినట్లు తేలితే వాటికి రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునంతా ఆ సంస్థ నుంచి రికవర్ చేస్తారు. ఇలాంటి సంస్థపై పరీక్షలు నిర్వహించకుండా నాలుగేళ్ల పాటు బ్యాన్‌ విధిస్తారు.

Also Read :Sri Krishna: మరణానికి దుఃఖించకూడదు.. శ్రీ కృష్ణుడు అర్జునుడితో ఎందుకు ఇలా అన్నాడో తెలుసా..?

  • పేపర్ లీక్ కేసులను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి కంటే తక్కువ లేని అధికారి విచారిస్తారు.
  • దర్యాప్తును ఏదైనా కేంద్ర ఏజెన్సీకి అప్పగించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
  • ఈ బిల్లులో పేపర్ లీక్‌తో ముడిపడిన 20 రకాల నేరాలు, అక్రమాలకు పాల్పడే వారికి విధించాల్సిన శిక్షల గురించి ప్రస్తావించారు.
  • మాస్ కాపీయింగ్, జవాబు పత్రాలను తారుమారు చేయడం, ఓఎంఆర్ షీట్లను ట్యాంపరింగ్ చేయడం వంటివన్నీ ఈ నేరాల జాబితాలో ఉన్నాయి.

Also Read :Vastu Tips: ఇంటికి ఏ దిశలో ఏయే వస్తువులు ఉంటే మంచిదో తెలుసా..?

  Last Updated: 22 Jun 2024, 09:29 AM IST