Caste Census : ఈరోజు కేంద్ర క్యాబినెట్ భేటీలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జనాభా లెక్కల్లోనే కులగణనను(Caste Census) చేరుస్తామని కేంద్ర సర్కారు వెల్లడించింది. ‘‘కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాలు నామ్‌కే వాస్తే సర్వేలు చేయించాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేపడుతున్న సర్వేల్లో పారదర్శకత లేదు’’ అని ఆరోపించింది. క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ‘‘తదుపరిగా చేపట్టబోయే జనగణనలోనే కులగణనను కూడా చేర్చాలని రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈరోజు నిర్ణయించింది’’ అని ఆయన చెప్పారు.
Also Read :Nandamuri Balakrishna : ‘జైలర్2’లో నందమూరి బాలకృష్ణ.. చిరంజీవి కూడా నటిస్తారా ?
మొదటినుంచీ కాంగ్రెసే వ్యతిరేకిస్తోంది
‘‘కులగణనను మొదటినుంచీ కాంగ్రెస్ పార్టీయే వ్యతిరేకిస్తోంది. కులగణనపై తన సారథ్యంలోని కేంద్ర క్యాబినెట్‌లో ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందని 2010లో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు’’ అని అశ్వినీ వైష్ణవ్ గుర్తుచేశారు. ‘‘మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కులగణన అంశంపై చర్చించేందుకు కేంద్ర మంత్రుల టీమ్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లోనే చాలా రాజకీయ పార్టీలు కులగణనకు సంబంధించిన ప్రతిపాదనను బలపర్చాయి. అయినా నాటి యూపీఏ సర్కారు కులగణన విషయంలో ముందడుగు వేయలేదు’’ అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో రాజకీయ కోణంలోనే కులగణన సర్వేలు జరిగాయని, వాటిలో అస్సలు పారదర్శకత లేదని అశ్వినీ వైష్ణవ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కులగణన అంశాన్ని వాడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. దేశంలోని సామాజిక సమాహారాన్ని తెలుసుకునే గొప్ప సంకల్పంతో మాత్రమే కులగణన జరగాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read :NSAB : పాక్‌తో కయ్యం వేళ ఎన్‌ఎస్‌ఏబీ పునర్ వ్యవస్థీకరణ.. ఛైర్మన్‌గా అలోక్ జోషి.. ఎవరు ?
టార్గెట్ బిహార్ అసెంబ్లీ పోల్స్
ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్‌డీఏ కూటమిలో కీలక మిత్రపక్షంగా ఉన్న జేడీయూ మొదటి నుంచే కులగణన చేయాలని డిమాండ్ చేస్తోంది. నితీశ్ కుమార్ సర్కారు 2023లోనే బిహార్‌లో కులగణన జరిపించింది. కులగణన దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఆ పార్టీ గళం విప్పుతోంది. అందుకే బిహార్ ఎన్నికలు సమీపించిన వేళ కులగణన నిర్వహణకు అనుకూలంగా ఎన్‌డీఏ కూటమి సర్కారు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.