India – Pakistan War : ఉగ్రదాడుల లైవ్ ప్రసారాలపై కేంద్రం సీరియస్

India - Pakistan War : ఇటువంటి సున్నిత పరిస్థితుల్లో కొన్ని భారతీయ మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఈ ఉగ్రదాడులను, రక్షణ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది

Published By: HashtagU Telugu Desk
Terror Attacks

Terror Attacks

ఇటీవల పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారతదేశం చేపట్టిన “ఆపరేషన్ సింధూర్” ఉగ్రవాద శిబిరాలపై దాడులతో పాకిస్తాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ కౌంటర్ ఆపరేషన్ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా భారత్‌పై దాడులకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇటువంటి సున్నిత పరిస్థితుల్లో కొన్ని భారతీయ మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఈ ఉగ్రదాడులను, రక్షణ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

India – Pakistan War : మీకు ఆ భయం అవసరం లేదు – ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

భారత రక్షణ శాఖ ఈ రోజు ఎక్స్ (మునుపటి ట్విట్టర్) లో ఓ అధికారిక పోస్టు విడుదల చేస్తూ, ఉగ్రదాడుల సమయంలో భద్రతా దళాల కదలికలు, ఆపరేషన్ వివరాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల శత్రుదేశాలకు మేలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇటువంటి సమాచారాన్ని బహిర్గతం చేయడం వలన కార్యాచరణ సామర్థ్యం దెబ్బతిని, భద్రతా సిబ్బంది ప్రాణాలకు ముప్పు తలెత్తవచ్చని తెలిపింది. గతంలో కార్గిల్ యుద్ధం, 26/11 ముంబయి దాడులు, కాందహార్ హైజాక్ ఘటనల సమయంలో అకాల ప్రసారాల వల్ల ఏర్పడిన ప్రమాదాలను కూడా గుర్తు చేసింది.

కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (సవరణ) నియమావళి 2021లోని క్లాజు 6(1)(p) ప్రకారం, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల సమయంలో కేవలం అధికారికంగా నియమించబడిన ప్రతినిధుల నుండి వచ్చే బ్రీఫింగ్‌లకే ప్రసారం హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మీడియా ఛానెల్‌లు, డిజిటల్ మాధ్యమాలు అత్యున్నత విలువలు పాటిస్తూ, జాతీయ భద్రతను పరిగణలోకి తీసుకొని అప్రమత్తంగా వ్యవహరించాలని రక్షణ శాఖ పిలుపునిచ్చింది.

  Last Updated: 09 May 2025, 01:47 PM IST