UPI transactions : నేడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. చిన్న మొత్తంలో జరిపే యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1500 కోట్లు కేటాయించింది. తక్కువ విలువతో కూడిన యూపీఐ లావాదేవీలకు (వ్యక్తి నుంచి వ్యాపారికి) ఈ స్కీమ్ కింద ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
Read Also:Richest MLA : దేశంలోని సంపన్న ఎమ్మెల్యేల జాబితా.. ఏపీయే టాప్
యూపీఐ లావాదేవీలు అనుమతించినందుకు గానూ చిన్న వ్యాపారులు ఒక్కో లావాదేవీకి 0.15 శాతం చొప్పున ప్రోత్సాహం కింద అందుకుంటారు. ఆపై మొత్తాలపై ఎలాంటి ప్రోత్సాహకాలు లభించవు. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలకు ఎండీఆర్ ఛార్జీలు వర్తించడం లేదు. వచ్చే ఏడాదీ ఈ స్కీమ్ కొనసాగుతుందని మంత్రి తెలిపారు. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఈ ప్రోత్సాహకాల కింద రూ.1500 కోట్లు చెల్లించేందుకు కేబినెట్ నిర్ణయించింది. దీనివల్ల చిన్న వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది.
నవీ ముంబయిలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ పోర్ట్‌ను జాతీయ రహదారితో 6 వరుసల రహదారి నిర్మాణానికి రూ.4500 కోట్లు కేటాయించినట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. యూపీఐతో పాటు రూ.10,601 కోట్లతో అస్సాంలో నూతన బ్రౌన్‌ఫీల్డ్ అమ్మోనియా యూరియా కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని మంత్రి తెలిపారు. రూ.2,790 కోట్లతో దేశంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కేబినెట్ అనుమతి ఇచ్చింది.