Caste Survey : మోడీ మెడకు క్యాస్ట్ సర్వే ఉచ్చు

కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ, రాహుల్ గాంధీ బహిరంగంగానే క్యాస్ట్ (Caste) సెన్సస్ పక్షాన గట్టి స్టాండ్ తీసుకున్నారు.

  • Written By:
  • Updated On - October 7, 2023 / 12:59 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Caste Survey Report : బీహార్ ముఖ్యమంత్రి జేడీ(యు) నేత నితీష్ కుమార్ బీహార్లో కులాధార జనాభా లెక్కల వివరాలను ప్రకటించిన మరుక్షణం నుంచి దేశవ్యాప్తంగా రాజకీయాలు సెన్సస్ చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ, రాహుల్ గాంధీ బహిరంగంగానే క్యాస్ట్ (Caste) సెన్సస్ పక్షాన గట్టి స్టాండ్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశమంతా ఈ లెక్కలు తీయాలని పట్టుపడుతోంది. అంతేకాదు ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమిలోని దాదాపు పార్టీలన్నీ బీహార్ దారిలో దేశమంతా నడవాలని, కులాధార జనాభా లెక్కల డేటా తీయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇంతటితో పరిస్థితి ఆగలేదు. కేంద్రంలో అధికార బిజెపిలో కూడా ఈ క్యాస్ట్ (Caste) సెన్సస్ కు మద్దతుగా చాలామంది నాయకులు బహిరంగంగానో, రహస్యంగానో మాట్లాడుతున్నారు. ఇవన్నీ ప్రధాని మోడీ గమనిస్తూనే ఉన్నారు. ఎవరు ఎట్లా మాట్లాడినా మోడీ మాత్రం కుల ప్రాతిపదిక మీద జనాభా లెక్కలు తీయడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు.

ఇది హిందూ సమాజాన్ని విభజించడమేనని ఆయన చేసిన వ్యాఖ్య బీజేపీలో వారికి కూడా చాలామందికి నచ్చడం లేదు. ప్రధాని మోడీ కుల ప్రాతిపదికన జనాభా లెక్కలు తీయడాన్ని మహాపాపంగా అభివర్ణించారు. ఈ పాపానికి కాంగ్రెస్ పార్టీ ఒడికడుతోందని, తద్వారా దేశంలోని మైనారిటీల హక్కులకు కాంగ్రెస్ భంగం కలిగిస్తోందని మోడీ విమర్శించారు. ఇది క్యాస్ట్ (Caste) సెన్సస్ పై ప్రధాని మోడీ అభిప్రాయాన్ని స్పష్టపరుస్తున్నప్పటికీ, ఆయన పార్టీలోనే ఆ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్న చాలామంది కనిపిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఒకపక్క నితీష్ కుమార్ తాను చేసిన చర్య ఒక విప్లవాత్మకమైనదిగా అందరూ భావిస్తుండడాన్ని బట్టి ఇప్పుడు చాలా ఉత్సాహంగా మరింత ముందుకు వెళ్లేలా కనిపిస్తున్నారు. ఈ విషయం మీద అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు. అంతేకాదు మరో నెలన్నర రోజులలో బీహార్ లో జరిపిన ఆర్థిక సర్వే వివరాలను కూడా శాసనసభలో పెడతామని నితీష్ ప్రకటించారు. ఆయన దూకుడు చూస్తే బిజెపిలో చాలామందికి కంగారుపుడుతోంది.

నితీష్ కుమార్ ఇప్పుడే కాదు. కేంద్రంలో వాజ్ పేయి ప్రభుత్వం ఏర్పడిన కాలం నుంచి ఇప్పటివరకు ఓబీసీ కార్డును మధ్య మధ్యలో తీసి బిజెపి వర్గాలను కలవర పెడుతూనే ఉన్నారు. ఒకప్పుడు రామ్ విలాస్ పాశ్వాన్ ఎస్సీ ఎంపీల ఫోరం పెట్టడానికి ప్రయత్నించినప్పుడు, దానికి పోటీగా బీసీ ఎంపీల ఫోరం పెట్టడానికి నితీష్ ప్రయత్నాలు చేసిన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిజెపిలో బలమైన ఓబిసి నాయకుడు కళ్యాణ్ సింగ్ తో పాటు అనేకమంది బిజెపిలోని ఓబీసీ నాయకులు నితీష్ కుమార్ తో చేతులు చేతులు కలిపిన ఒకానొక సందర్భం ఉంది. అప్పుడు బిజెపి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎంత ఇరకాటంలో పడిందో మనకు తెలుసు. మండల్ కమిషన్కు వ్యతిరేకంగా కమండలం ముందు పెట్టి ఎన్డీఏ రాజకీయం సాగించాల్సిన పరిస్థితి వచ్చింది.

కానీ ఇప్పుడు నితీష్ కుమార్ బీహార్ లో బయటపెట్టిన కులాధార లెక్కల వివరాలు మరోసారి బిజెపిని ఇరకాటంలో పెట్టే పరిస్థితి కల్పించాయి. బిజెపిలో చాలామంది నాయకులు బహిరంగంగానే క్యాస్ట్ సెన్సస్ కు మద్దతు ప్రకటిస్తున్నారు. మోడీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అప్నాదళ్ నాయకులు అనుప్రియా పటేల్ దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సస్ నిర్వహించడానికి తన మద్దతును బహిరంగంగా ప్రకటించారు. బీహార్లో బిజెపి సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోడీ, ఈ కులాధార జనగణన వాస్తవానికి తమ పార్టీ బీహార్లో అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ, నితీష్ కుమార్ కలిసి చేసిన ఆలోచనే అని దీన్ని వోన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Also Read:  Pawan Kalyan Alliance BRS : కేసీఆర్ ను గెలిపించేందుకు పవన్ భారీ స్కెచ్..?

అంటే నితీష్ కుమార్ జరిపిన క్యాస్ట్ సర్వే క్రెడిట్ బిజెపికి దక్కించాలని ఆయన ప్రయత్నంగా కనిపిస్తుంది. బీహార్లో వెలుగు చూసిన జనాభా లెక్కల ప్రకారం రానున్న రోజుల్లో చట్టసభల్లోను ఉద్యోగాల్లోనూ వెనకబడిన కులాల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి నితీష్ కుమార్ ప్రయత్నం చేయవచ్చని, ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న స్టాండ్ తెలివైనది కాదని కొందరు బిజెపి నాయకులు రహస్యంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

ఈ వాతావరణం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ చుట్టూ ఒక గందరగోళ పరిస్థితిని సృష్టించింది. మరో పక్క కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన ప్రతిపక్షాలన్నీ దేశవ్యాప్తంగా క్యాస్ట్ సర్వే నిర్వహించాలని చేస్తున్న డిమాండ్ కూడా బిజెపిని ఇరకాటంలో పెడుతోంది. దీనికి తోడు బీహార్లో నిర్వహించిన క్యాస్ట్ సర్వే పైన స్టే విధించాలని సుప్రీంకోర్టులో కొందరు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసిన తాజా పరిణామం కూడా బిజెపికి సంకట స్థితిని తీసుకొచ్చింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓబిసి ల విషయంలో ఎలా ఉన్నప్పటికీ, ఇప్పుడు ఆ పార్టీ ఓపెన్ గానే ఓబీసీ పక్షాన మాట్లాడుతోంది. రాహుల్ గాంధీ ఇటీవల పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో చెప్పిన మాటలు కూడా గుర్తు తెచ్చుకోవాలి.

కేంద్ర ప్రభుత్వంలో 90 మంది కార్యదర్శులు ఉంటే వారిలో ముగ్గురు మాత్రమే ఓబీసీలున్నారని, అంటే బడ్జెట్లో ఐదు శాతం మాత్రమే ఓబీసీల కంట్రోల్లో ఉందని రాహుల్ గాంధీ చెప్పిన లెక్కల వివరాలు అధికార వర్గాలను ఖంగుతినిపించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు నితీష్ కుమార్ కులగణన బాంబు పేల్చారు. ఇది హిందూ సమాజాన్ని విడదీసే పాపకార్యంగా ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నా, ఆయన ఈ విషయంలో త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే సొంత పార్టీలోనే చాలా కలకలం పుట్టే అవకాశం ఉన్నట్టు రాజకీయ వాతావరణ శాఖ సూచిస్తోంది. చూడాలి నరేంద్ర మోడీ ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో.

Also Read:  Telangana Leaders : తెలంగాణలో నాయకులంతా ఆ పార్టీ నీడలేనా..?