Site icon HashtagU Telugu

Prashant Kishor : ప్రశాంత్ కిశోర్‌పై కేసు.. బీపీఎస్‌‌సీ అభ్యర్థులను రెచ్చగొట్టారనే అభియోగం

Prashant Kishor Bihar Civils Aspirants Protest

Prashant Kishor : జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్‌(Prashant Kishor) సహా పలువురిపై  బిహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో నిరసన తెలుపుతున్న బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌‌సీ) అభ్యర్థులను రెచ్చగొట్టారనే అభియోగాలతో పీకేపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ కిశోర్,  జన్ సురాజ్ పార్టీకి చెందిన పలువురు నేతలు అభ్యర్థులను రెచ్చగొట్టేలా ప్రసంగించారు. దీంతో అభ్యర్థులు పాట్నా వీధుల్లోకి వచ్చి  వివిధ ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించారు.  జిల్లా అధికార యంత్రాంగం అనుమతులు ఇవ్వకున్నా గాంధీ మైదాన్ సమీపంలో బీపీఎస్‌సీ అభ్యర్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారని పోలీసులు తెలిపారు.

Also Read :Jimmy Carter : అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత.. ఆయన లైఫ్‌లోని కీలక ఘట్టాలివీ

ఈ వ్యవహారంలో జన్ సురాజ్ పార్టీ బిహార్ చీఫ్‌ మనోజ్ భారతిపై కూడా కేసు నమోదైంది. కేసులు నమోదైన వారిలో..  రహ్మాన్షు మిశ్రా,  నిఖిల్ మణి తివారీ, సుభాష్ కుమార్ ఠాకూర్, శుభమ్ స్నేహిల్, ఆనంద్ మిశ్రా, రాకేష్ కుమార్ మిశ్రా తదితరులు ఉన్నారు. వీరితో పాటు 600 మంది గుర్తు తెలియని వ్యక్తులను కూడా నిందితులుగా చేర్చారు. పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ ఈవివరాలను ధృవీకరించారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందన్నారు.

Also Read :Dil Raju : ఏపీ డిప్యూటీ సీఎంతో దిల్ రాజు మీటింగ్..!

70వ బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) ప్రిలిమినరీ పరీక్షను పునస్సమీక్షించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై తాము బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో చర్చించాలని భావిస్తున్నామని వారు తెలిపారు. ఆదివారం రోజు పాట్నాలో ఈ నిరసనలు తీవ్రరూపు దాల్చాయి. డిసెంబరు 13 నుంచి పాట్నా నగరంలోని గాంధీ మైదాన్‌లో ఈ నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి అనేక మంది రాజకీయ నాయకులు, విద్యావేత్తలు అభ్యర్థులకు తమ మద్దతును తెలియజేస్తున్నారు.  మరోవైపు గాంధీ మైదాన్‌లో ఛాత్ర సంసద్ (విద్యార్థి పార్లమెంట్) నిర్వహించేందుకు ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ శనివారం రోజు పాట్నా జిల్లా అధికార యంత్రాంగాన్ని అనుమతి కోరింది. అయితే  అనుమతి ఇచ్చేందుకు  అధికారులు నో చెప్పారు. అయినప్పటికీ ఆదివారం గాంధీ మైదాన్‌లో అభ్యర్థులతో భారీ సమావేశాలు నిర్వహించారని పోలీసులు ఆరోపించారు.