Site icon HashtagU Telugu

Canada : భారత విద్యార్థులకు కెనడా భారీ షాక్.. 80 శాతం వీసాల తిరస్కరణ!

Canada's big shock for Indian students.. 80 percent visas rejected!

Canada's big shock for Indian students.. 80 percent visas rejected!

Canada : విదేశాల్లో ఉన్నత విద్యపై ఆసక్తి చూపే భారత విద్యార్థులకు కెనడా ఓ ప్రముఖ గమ్యస్థానంగా పేరొందింది. మౌలిక వసతులు, ఉద్యోగ అవకాశాలు, జీవిత నాణ్యత వంటి అంశాలపై దృష్టి పెట్టే యువతకు ఇది ఓ కలల దేశంగా మారింది. కానీ తాజా పరిణామాలు భారతీయ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. కెనడా ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త విధానాలు భారత విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. 2024లో భారత విద్యార్థులు దాఖలు చేసిన స్టూడెంట్ వీసాలలో 80 శాతం దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. ఇది గత పదేళ్లలో కనీవినీ ఎరుగని స్థాయిలో వీసా తిరస్కరణ. కెనడా ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ (IRCC) తాజా నివేదిక ప్రకారం, ఇటువంటి తీవ్రత వీసా విధానాల్లో ఎప్పుడూ కనిపించలేదని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో, 2024లో కెనడాలో ప్రవేశించిన భారతీయ విద్యార్థుల సంఖ్య కేవలం 1.88 లక్షలకే పరిమితమైంది. ఇది రెండేళ్ల క్రితం నమోదైన సంఖ్యతో పోల్చితే సగానికి తగ్గినట్టే. ఒకప్పుడు మొత్తం భారత విదేశీ విద్యార్థులలో 18 శాతం మంది కెనడాను ఎంచుకుంటే, ఇప్పుడు ఆ సంఖ్య 9 శాతానికి పడిపోయింది.

Read Also: High Alert : నేపాల్‌లో ఉద్రిక్తతలు: భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్..రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రత

ఇంత తీవ్రమైన మార్పుల వెనక కారణాలేంటంటే..కెనడాలో గృహాల కొరత తీవ్రంగా ఉంది. అంతేకాకుండా మౌలిక వసతులపై పెరిగిన ఒత్తిడి, స్థానిక రాజకీయ ఒడిదుడుకులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. దీని ప్రభావంగా ప్రభుత్వం వీసా ప్రక్రియను మరింత కఠినతరం చేసింది. ఇప్పుడేం జరుగుతోంది అంటే. విద్యార్థులు స్పష్టమైన స్టడీ ప్లాన్, మన్నించదగిన ఆర్థిక ఆధారాలు, లాంగ్వేజ్ టెస్ట్ ఫలితాలు సమర్పించాల్సిన బాధ్యత పెరిగింది. కనీసంగా చూపవలసిన ఆర్థిక సామర్థ్యం ఇప్పుడు CAD $20,000 కు పైగా కావాలి. ఇది గతంలోకంటే రెట్టింపు. చదువు పూర్తయ్యాక ఉద్యోగాల అవకాశాలు తగ్గాయి. వర్క్ పర్మిట్ కోసం నిబంధనల కఠినతరం జరిగింది. వేగంగా వీసా మంజూరయ్యే స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ (SDS) పథకాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ కఠిన పరిస్థితుల మధ్య భారత విద్యార్థులు కొత్త అవకాశాల కోసం దారుల వెతుకులాట ప్రారంభించారు. అందులో ఇప్పుడు జర్మనీ ముందంజలో ఉంది.

జర్మనీకి మళ్లిన దృష్టి ‘అప్‌గ్రాడ్’ అనే నివేదిక ప్రకారం, ప్రస్తుతం 31 శాతం భారత విద్యార్థులు జర్మనీలో విద్యనభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి గల కారణాలు.. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఉచిత లేదా తక్కువ ఫీజులతో విద్య. అనేక కోర్సులు ఇంగ్లిష్‌లో బోధ. బలమైన ఆర్థిక వ్యవస్థ. మెరుగైన ఉపాధి అవకాశాలు. ఈ ప్రయోజనాల వలన గత ఐదేళ్లలో జర్మనీలో భారత విద్యార్థుల సంఖ్య రెట్టింపై సుమారు 60,000కు చేరుకుందని గణాంకాలు చెబుతున్నాయి. కెనడా తీసుకుంటున్న నిర్ణయాలు భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒకపక్క కలల దేశం తలుపులు మూస్తుండగా, మరోపక్క జర్మనీ వంటి దేశాలు సరికొత్త అవకాశాలను అందిస్తున్నాయి. ఈ మారుతున్న పరిస్థితుల్లో విద్యార్థులు తమ లక్ష్యాలకు అనుగుణంగా, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read Also: Kumari Aunty : నెట్టింట వైరల్‌గా మారిన కుమారీ ఆంటీ వీడియో