Industrial Smart Cities : కేంద్ర క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు 10 రాష్ట్రాల్లో కొత్తగా 12 స్మార్ట్ పారిశ్రామిక నగరాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీని ద్వారా 10 లక్షల మందికి ప్రత్యక్షంగా, 30 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగాల కల్పన(Industrial Smart Cities) జరుగుతుందని వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
రూ.28,602 కోట్ల పెట్టుబడితో 12 కొత్త పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పారిశ్రామిక కారిడార్ల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని ఓర్వకల్లు-కొప్పర్తి, తెలంగాణలోని జహీరాబాద్, రాజస్థాన్‌లోని జోధ్‌పుర్-పాలి, ఉత్తరాఖండ్‌లోని ఖుర్పియా, పంజాబ్‌లోని రాజ్‌పురా-పాటియాలా, మహారాష్ట్రలోని దిఘి, కేరళలోని పాలక్కడ్, యూపీలోని ఆగ్రా-ప్రయాగ్‌రాజ్, బిహార్‌లోని గయ ఉన్నాయన్నారు. ఈ కారిడార్లు దాదాపు రూ.1.52 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయని ఆయన చెప్పారు. ‘‘పారిశ్రామిక హబ్ కింద కడప జిల్లా కొప్పర్తిలో 2,596 ఎకరాలను డెవలప్ చేస్తాం. దీని కోసం రూ.2,137 కోట్లను ఖర్చు చేయనున్నాం. దీనివల్ల 54వేల మందికి ఉపాధి లభిస్తుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్‌ను(Industrial Smart Cities) ఏర్పాటు చేస్తాం. దీనిపై రూ.2,786 కోట్లు పెట్టుబడి పెడతాం. 45వేల మందికి ఉపాధి దొరుకుతుంది’’ అని కేంద్రమంత్రి వివరించారు.
Also Read :MLC Kavitha : కవిత లాయర్లకు ఆ పత్రాలివ్వండి.. సీబీఐకు ట్రయల్ కోర్టు ఆదేశాలు
ప్రపంచస్థాయిలో ఉండేలా ఈ 12 గ్రీన్ ఫీల్డ్ పారిశ్రామిక స్మార్ట్ సిటీలను ‘ప్లగ్-ఎన్-ప్లే’, ‘వాక్-టు-వర్క్’ కాన్సెప్ట్‌లతో నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అమృత్‌సర్-కోల్‌కతా, ఢిల్లీ-ముంబై, వైజాగ్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-నాగ్‌పూర్, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లతో సహా ఆరు పారిశ్రామిక కారిడార్లలో ఈ ప్రాజెక్టులను అమలు చేస్తామని పేర్కొంది. 2020 సంవత్సరంంలో రూ. లక్ష కోట్ల బడ్జెట్‌తో ప్రారంభించిన అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌ను విస్తరించనున్నట్లు క్యాబినెట్ ప్రకటించింది. దీని ద్వారా ప్యాక్ హౌస్‌లు, కోల్డ్ స్టోరేజీ, రిఫ్రిజిరేటెడ్ వాహనాలు, ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్ల వంటి సదుపాయాలకు నిధులు అందనున్నాయి.