దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీకి చెందిన ముస్తఫాబాద్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల ఓ పాత భవనం (Delhi Building Collapse) తెల్లవారుజామున అకస్మాత్తుగా కుప్పకూలింది. దాదాపు 20 ఏళ్ల పాత ఈ భవనం ప్రమాదకరంగా మారిన పరిస్థితుల్లోనూ నివాసితులు అక్కడే ఉండటంతో ఈ విషాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Viral : కల్లు కోసం రోడ్డెక్కిన గ్రామస్థులు
ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్ఎఫ్ (NDRF), అగ్నిమాపక సిబ్బంది, ఢిల్లీ పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు 12 గంటలకుపైగా ఎనలేని శ్రమ చేశారు. ఎత్తైన క్రేన్‌లు, గ్యాస్ కటర్లు, హైడ్రాలిక్ టూల్స్ సహాయంతో శిథిలాల్ని తొలగించారు. క్షతగాత్రులను బయటకు తీసి దగ్గరలోని ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మరికొందరు ఇంకా శిథిలాల్లో చిక్కుకుని ఉండే అవకాశం ఉన్నందున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రమాదంపై ఢిల్లీ ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. నివాస భవనాల భద్రతా ప్రమాణాలపై తిరిగి సమీక్ష చేయాలని అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పాత భవనాలపై పూర్తిస్థాయి అంచనా వేయాలని, వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.