Budget 2026 – 27 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026-27 తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు మరియు పారిశ్రామిక అభివృద్ధి పరంగా గొప్ప ఊరటనిచ్చింది. ఈ బడ్జెట్‌లో ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల కారిడార్లను (Rare Mineral Corridors) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఏపీలోని గనుల రంగానికి కొత్త జవజీవాలను ఇవ్వనుంది. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పుగా దేశవ్యాప్తంగా ప్రకటించిన 7 హైస్పీడ్ రైలు కారిడార్లలో తెలుగు రాష్ట్రాలకు అత్యధిక ప్రాధాన్యత లభించడం విశేషం. భాగ్యనగరాన్ని ఇతర మెట్రో నగరాలతో కలిపే ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి ఇంజిన్లుగా మారనున్నాయి.
జిల్లా కేంద్రాల్లో మార్పులు – ఎంఎస్ఎంఈలకు ఊతం
ప్రతి జిల్లాను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో నిర్మలమ్మ కీలక నిర్ణయాలు వెల్లడించారు. మహిళా విద్యను ప్రోత్సహించేందుకు దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో బాలికల వసతి గృహం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల (MSME) బలోపేతానికి రూ. 2,000 కోట్లు కేటాయించడంతో పాటు, ‘స్వయం సమృద్ధ భారతం’ పేరుతో మరో రూ. 2,000 కోట్ల నిధిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కొనుగోళ్లలో ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా స్థానిక పరిశ్రమలు పుంజుకోనున్నాయి. ఆతిథ్య రంగం (Hospitality) అభివృద్ధికి జాతీయ స్థాయి సంస్థను ఏర్పాటు చేయనుండటం పర్యాటక రంగానికి కలిసొచ్చే అంశం.
ఆరోగ్య భారతం – బయో-ఫార్మా శక్తి
దేశంలో పెరుగుతున్న మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. భారత్‌ను ప్రపంచ బయో-ఫార్మా తయారీ కేంద్రంగా మార్చేందుకు ‘బయో-ఫార్మా శక్తి’ అనే సరికొత్త పథకాన్ని ప్రకటించారు. దీని కోసం రాబోయే ఐదేళ్లలో రూ. 10,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. దేశవ్యాప్తంగా 5 ప్రాంతీయ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, మూలధన వ్యయాన్ని (Capital Expenditure) రూ. 12.2 లక్షల కోట్లకు పెంచడం ద్వారా దీర్ఘకాలిక ఆస్తుల సృష్టిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. విదేశీ భారతీయులు (NRIs) భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే పరిమితిని పెంచడం ద్వారా విదేశీ నిధుల ప్రవాహాన్ని పెంచేందుకు మార్గం సుగమం చేశారు.
