Bomb Threats : దేశ వ్యాప్తంగా బాంబు బెదిరింపులు మళ్లీ అలజడి సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో ఈ తరహా బెదిరింపులతో భద్రతా యంత్రాంగం అప్రమత్తమవుతోంది. తాజాగా, దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. శనివారం (జూలై 26) ఉదయం ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మూడు వేర్వేరు మొబైల్ నంబర్ల నుంచి బాంబు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. విమానాశ్రయం టెర్మినల్ 2 వద్ద బాంబు అమర్చామని, అది త్వరలో పేలనుందంటూ తెలియజేశారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ముంబై పోలీసులు అప్రమత్తమై, ఎయిర్‌పోర్ట్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Read Also: Supreme Court : విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేందుకు సుప్రీంకోర్టు కీలక చర్య.. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు మార్గదర్శకాలు
బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ను వెంటనే విమానాశ్రయానికి తరలించి, విస్తృతంగా తనిఖీలు ప్రారంభించారు. ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ, టెర్మినల్ పరిసరాలను ఖాళీ చేయించారు. గంటల తరబడి జరిగిన శోధనల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదు. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే బెదిరింపు కాల్‌ను లైట్ తీసుకోవడం లేదని, ఇది ఎలాంటి ఉగ్ర ముఠాల హెచ్చరిక కావచ్చునన్న అనుమానంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ ఫోన్లు అస్సాం, పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబర్ల నుంచి వచ్చాయని గుర్తించారు. దీని ఆధారంగా ముంబై పోలీసులు అక్కడి పోలీసులతో సంప్రదింపులు ప్రారంభించారు. కాల్స్ చేసిన వారెవరు? ఎందుకు చేశారు? ఉద్దేశం ఏమిటి? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ బెదిరింపులు కేవలం జోక్‌గానా, లేకపోతే పక్కా ప్రణాళికతో చేసిన కుట్రగానా అన్నది త్వరలోనే వెలుగులోకి రానుంది.
ఇటీవలే బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లోని విమానాశ్రయాలు, బస్తీలకు ఇలాంటి ఫేక్ బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. వాటిలో ఎక్కువగా ఫేక్ అలర్ట్స్‌గానే నిరూపితమయ్యాయి కానీ, ఈ బెదిరింపులు భద్రతా వ్యవస్థలపై మరింత ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ప్రయాణికుల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. దీంతో ఈ తరహా బెదిరింపులను పరిగణనలోకి తీసుకుని, దేశ వ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్‌ల భద్రతను మరింత బలోపేతం చేసేలా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో డిజిటల్ నెంబర్లు, వర్చువల్ సిమ్‌లు వాడుతూ వచ్చే బెదిరింపు కాల్స్‌ను గుర్తించడంలో పోలీసులు కొత్త సాంకేతికతను వినియోగిస్తున్నారు. ముంబై ఘటనపై కూడా సైబర్ సెల్ టీమ్, ఇంటెలిజెన్స్ వింగ్ ఇప్పటికే రంగంలోకి దిగింది. ఈ దుష్కృత్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా దర్యాప్తు కొనసాగుతున్నదని ముంబై పోలీసులు ప్రకటించారు.
Read Also: Minister Narayana : మరోసారి నోరు జారి వివాదాల్లో చిక్కుకున్న ‘నారాయణ’