Bomb threat : విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే గురువారం విస్తారా విమనానికి బెదిరింపులు రావడంతో విమానాన్ని దారి మళ్లించిన విషయం తెలిసిందే. తాజాగా ఎయిర్ ఇండియా విమానానికి సైతం బెదిరింపులు వచ్చాయి. ముంబయి నుంచి లండన్‌కు బయలుదేరి విమానానికి బెదిరింపులు రావడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఫ్లైట్ మానిటరింగ్ వెబ్‌సైట్ ‘ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం.. ఎయిర్ ఇండియా బోగింగ్ 777 విమానం ముంబయి నుంచి ఉదయం 7:05 గంటలకు (భారత కాలమానం ప్రకారం) టేకాఫ్ అయ్యింది. తూర్పు ఇంగ్లండ్ వైపు వెళ్తున్న సమయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానం AI129 లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో మధ్యాహ్నం 12:05 గంటలకు (యూకే కాలమానం ప్రకారం) దిగాల్సి ఉంది.
అయితే, గంట ముందుగానే ఎమర్జెన్సీని ప్రకటించారు. విమానం హీత్రూ విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ అయ్యిందని వెబ్‌సైట్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. వరుసగా నాలుగు రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. నాలుగు రోజుల్లో కనీసం 20కిపైగా విమానాలకు బెదిరింపులు రావడంతో కలకలం సృష్టిస్తున్నది. ఇంతకు ముందు ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ముంబయికి వస్తున్న విస్తారా విమానానికి సైతం బెదిరింపులు వచ్చాయి. బోయింగ్ 787 విమానంలో 147 మంది ప్రయాణికులు ఉన్నారు. సోషల్ మీడియా బెదిరింపులు వచ్చిన తర్వాత సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినట్లు విస్తారా ప్రతినిధి తెలిపారు.
ఆ తర్వాత విమానాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారన్నారు. విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారన్నారు. అలాగే, ఇస్తాంబుల్ నుంచి ముంబయికి వస్తున్న ఫ్లైట్ 6E 18కి సెక్యూరిటీ అలర్ట్ అందిందని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం రెండు విస్తారా, రెండు ఇండిగో, ఐదు ఎయిర్ ఇండియా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. విమానాలు ఆకాశంలో ఎగురుతున్న సమయంలో పలానా విమానంలో బాంబు పెట్టామంటూ ఈమెయిల్స్, సోషల్ మీడియా పోస్ట్, ఫోన్స్ కాల్స్ వస్తుండడం ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విమానాలను ఆయా సంస్థలు దారి మళ్లించి తనిఖీలు నిర్వహించిన సమయాల్లో ఫేక్ కాల్స్‌గా తేలుతున్నాయి.
అయితే, హెచ్చరికలను తేలిగ్గా కొట్టిపడేస్తే.. కొన్ని సందర్భాల్లో నిజమైతే పరిస్థితి ఏంటన్నది తలనొప్పిగా మారింది. అయితే, ఇటీవల మూడు విమానాలకు వచ్చిన బాంబు బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 17 సంవత్సరాల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ షాప్ యజమానితో ఉన్న ఆర్థిక వివాదాల నేపథ్యంలో ఆ బాలుడు ఎక్స్‌లో అకౌంట్ క్రియేట్ చేసి బాంబు బెదిరింపుల జారీ చేస్తున్నట్లుగా ముంబయి పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. బుధవారం ఏడు విమానాలు, మంగళవారం తొమ్మిది విమానాలు, సోమవారం మూడు విమానాలకు, గురువారం మరికొన్ని బెదిరింపులు వచ్చాయి. ఇక విమానాలకు బాంబు బెదిరింపులు రావడాన్ని కేంద్రం నిశితంగా పరిశీలిస్తుందని పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.