Site icon HashtagU Telugu

Modi : మోడీ మంత్రమే బిజెపి ఏకైక అస్త్రం

Modi Mantram

Modi Mantram

డా. ప్రసాదమూర్తి

కీలకమైన రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే విషయం పట్ల సామాన్య పౌరులు కూడా ఆరా తీయడం సహజం. ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో మిజోరాంని మినహాయిస్తే మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, రాజస్థాన్, తెలంగాణ.. ఈ నాలుగు రాష్ట్రాల్లో అటు కాంగ్రెస్ కి ఇటు బిజెపికి విజయం చాలా కీలకం. ఈ నాలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ స్పష్టంగా ఉంది. మధ్యప్రదేశ్లో కమల్ నాథ్, చత్తీస్ గఢ్ లో అధికారంలో ఉన్న భూపేష్ బఘేల్, రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించకపోయినా ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి అనే విషయం కూడా నలుగురూ అనుకుంటున్నదే. కానీ బిజెపి మాత్రం ఈ నాలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ రాష్ట్రాల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ కార్డునే ప్రయోగించి బిజెపి నాయకులు ఎన్నికల బరిలో ముందుకు సాగుతున్నారు.

తొమ్మిదేళ్లుగా మోడీ మంత్రమే:

మధ్యప్రదేశ్లో బిజెపి అధికారంలో ఉంది. అక్కడ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్. కానీ అక్కడ కూడా బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు పేరూ ప్రకటించకపోవడం పలు సందేహాలకు దారితీస్తుంది. అంతేకాదు మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో బిజెపి నాయకులు మోడీ నినాదాన్నే అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. ‘మోడీకే మన్ మే బసే హై ఎంపి, ఎంపికే మన్ మే మోడీ’ అనే నినాదాన్ని సర్వత్రా వినిపిస్తున్నారు. అంటే మధ్యప్రదేశ్ మనసులో మోడీ కొలువై ఉన్నారు, మోడీ మనసులో మధ్యప్రదేశ్ ఉంది అని అర్థం. ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తిని పక్కనపెట్టి ప్రధానమంత్రి నామ జపం చేయడం ఎంతవరకు ఆ పార్టీకి ఉపయోగపడుతుందో ప్రస్తుతానికి చెప్పలేం. ఇది ఈనాటి నినాదం కాదు. 2015 బీహార్ ఎన్నికల నుంచి ఇప్పటివరకు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా మోడీ ముడ చిత్రాన్నే ముందు పెట్టుకుని బిజెపి నాయకులు ఎన్నికల పోరాటం చేయడం ఒక సంప్రదాయంగా మారిపోయింది. ఈ 8 ఏళ్లుగా ఈ మంత్రం ఎక్కడ ఎలా ఎలాంటి ఫలితాలు ఇచ్చినా, ఇకముందు ఆ ఫలితాలు ఎలా ఉంటాయో ప్రస్తుత పరిస్థితుల్లో ఊహించడం కష్టంగా ఉంది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో మోడీ కార్డు ఫలించలేదు. హిందుత్వ నినాదం కలిసి రాలేదు. అందుకే ఇప్పుడు జరుగుతున్న ఈ కీలక రాష్ట్రాల్లో మోడీ మంత్రం ఎంతవరకు ఫలిస్తుందో ఇటు రాజకీయ విశ్లేషకులలోనే కాదు అటు బిజెపి వర్గాల్లో కూడా కొంత సందేహం నెలకొని ఉంది.

మోడీ కూడా ప్రచారంలో తన మంత్రమే ఫలిస్తుందని గట్టిగా నమ్ముతున్నట్టున్నారు. అందుకే ఆయన ఓటర్లకు బహిరంగ లేఖలో ‘సీథా సమర్థన్’ అనే మాట వాడారు. అంటే తమ ప్రభుత్వానికే నేరుగా మద్దతునివ్వమని ఆయన ఉద్దేశం. రాజస్థాన్లో కూడా తన పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. వసుంధర రాజేని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అక్టోబర్ రెండున జైపూర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ మోడీ ఈ సభలో కూడా ఇచ్చిన నినాదం వేరుగా ఉంది. ‘ఇస్ చునావ్ మే కమల్ హమారా చెహరా హై’ అని మోడీ ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. అంటే రాజస్థాన్లో ముఖ్యమంత్రి ముఖం కమలమే అని అశేష జనాల ముఖం మీద చెప్పేశారు. అక్కడే కాదు చత్తీస్గడ్ లో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. అక్కడ పూర్వ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, విజయ బఘేల్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. కానీ ఛత్తీస్ గఢ్ లో కూడా వీళ్ళ పేర్లు ఉసెత్తకుండా ప్రధాని నరేంద్ర మోడీ ఘన కీర్తిని పఠిస్తూ నాయకులు ప్రచారం సాగిస్తున్నారు. ఛత్తీస్ గఢ్ లో బిజెపి నాయకులు ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన కంటే ఈడీని దాడికి ఉసిగొల్పడంలోనే ఎక్కువ మక్కువ కనబరిచారు. తెలంగాణలో కూడా ఇదే తరహాలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక్కడ బీసీ కార్డును బయటకు తీశారు. కానీ కనీసం బండి సంజయ్ ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి అతన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించేది. అదీ ఇక్కడ జరగలేదు. తెలంగాణలో కూడా మోడీ మ్యాజిక్ పనిచేస్తుందని బిజెపి వారి విశ్వాసం. ఇది ఎంతవరకు ఆచరణలో నిరూపితం అవుతుందో కాలమే చెప్పాలి. కాంగ్రెస్ మాత్రం ‘కామ్ కియే దిల్ సే.. కాంగ్రెస్ ఫిర్ సే’ అనే నినాదంతో ముందుకు కదులుతోంది. ఏ నినాదం ఓటర్ మదికి ప్రమోదం కలిగిస్తుందో లేచి చూడాల్సిందే.
Read Also : TS Polls – Janasena Candidates List : అభ్యర్థులను ప్రకటించిన జనసేన