Delhi New CM : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. దీంతో కాబోయే ఢిల్లీ సీఎం ఎవరు ? అనే ప్రశ్న అందరి మదిలో ఉదయిస్తోంది. దీనిపై రాజకీయ విశ్లేషకులు వివిధ రకాల విశ్లేషణలను అందిస్తున్నారు. కొందరేమో మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మకే సీఎం(Delhi New CM) అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే పర్వేశ్ కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. పర్వేశ్ వర్మ తండ్రి సాహిబ్ సింగ్ వర్మ గతంలో ఢిల్లీ సీఎంగా సేవలు అందించారు. అందుకే ఆయన పేరును బీజేపీ పెద్దలు పరిశీలిస్తారనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి రాజకీయ వారసత్వాన్ని బీజేపీ మొదటి నుంచీ ప్రోత్సహించడం లేదు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ గెల్చిన తర్వాత.. ఎలాంటి రాజకీయ వారసత్వం లేని వ్యక్తులను సీఎంగా చేశారు. ఈసారి ఢిల్లీలోనూ అలా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. అందుకే కచ్చితంగా పర్వేశ్ వర్మకే బీజేపీ అవకాశం ఇస్తుందని చెప్పలేం. ప్రస్తుతం న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఒక్కో రౌండ్‌కు ఫలితం మారుతోంది. అక్కడ పర్వేశ్ వర్మ గెలిస్తేనే ఏ అవకాశాలైనా సజీవం అవుతాయి.
Also Read :Key Leaders Result: ఆప్ అగ్రనేతల్లో ఆధిక్యంలో ఎవరు ? వెనుకంజలో ఎవరు ?
కైలాశ్ గెహ్లాట్
ప్రస్తుత బీజేపీ నేత, మాజీ ఆప్ నేత కైలాశ్ గెహ్లాట్ పేరును కూడా సీఎం పోస్టుకు బీజేపీ పరిశీలించే అవకాశం ఉందని అంటున్నారు. గత ఆప్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా కైలాశ్ గెహ్లాట్ మంచిపేరును సంపాదించారు. ఢిల్లీ పాలనా వ్యవహారాలపై ఆయనకు మంచి అవగాహన ఉంది. అందుకే సీఎం పోస్టుకు కైలాశ్ గెహ్లాట్‌ను ఎంపిక చేసేందుకు బీజేపీ పెద్దలు ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.
రమేశ్ బిధూరి
ఢిల్లీ సీఎం అతిషిపై కల్కాజీ అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్న బీజేపీ నేత, మాజీ ఎంపీ రమేశ్ బిధూరికి కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కల్కాజీ స్థానంలో అతిషిపై ఆయన లీడ్‌లో ఉన్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి రమేశ్ బిధూరియే అని గతంలో అరవింద్ కేజ్రీవాల్ కామెంట్స్ చేశారు.
సర్‌ప్రైజింగ్ ఎంపిక
కుల సమీకరణాలు, రాజకీయ అనుభవం, పాలనా వ్యవహారాలపై అవగాహన కలిగిన నేతకు బీజేపీ అవకాశం ఇవ్వొచ్చు. ఎవరూ అంచనా వేయని నేతకు సీఎం సీటును బీజేపీ అప్పగించినా ఆశ్చర్యపోకూడదు.