Kumari Selja : ఓ వైపు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కుమారి సెల్జా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉందని భావిస్తున్న బీజేపీ.. తనకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉందని ఆమె వెల్లడించారు. ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను లాక్కోవడానికి బీజేపీ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా హర్యానాలోని 90కి 90 అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ పార్టీయే గెల్చుకుంటుందని కుమారి సెల్జా పేర్కొన్నారు.
Also Read :Zakir Naik : అనాథ శరణాలయంలో కార్యక్రమం.. స్టేజీ నుంచి దిగిపోయిన జాకిర్ నాయక్
‘‘హర్యానా కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు ఉన్నాయా ?’’ అని మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నించగా..‘‘ఏమున్నా సరే పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది. తుది నిర్ణయాలను పార్టీ పెద్దలే తీసుకుంటారు’’ అని స్పష్టం చేశారు.హర్యానాలోని హిసార్‌లో ఉన్న పోలింగ్ బూత్‌లో సెల్జా(Kumari Selja) ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ కామెంట్స్ చేశారు. ఇవాళ జరిగే ఎన్నికలుహర్యానా భవితవ్యాన్ని మారుస్తాయన్నారు. అంతకుముందు శుక్రవారం రోజు ప్రముఖ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ.. హర్యానా కాంగ్రెస్ సీఎం అభ్యర్థుల జాబితాలో తప్పకుండా తన పేరు కూడా ఉంటుందని తెలిపారు. తనకు కూడా రాష్ట్రంలో మంచి బలమే ఉందని చెప్పారు.
Also Read :Iran Vs US : ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి.. బైడెన్, ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,031 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఓటింగ్ కోసం 20,632 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 8న జమ్మూ కాశ్మీర్‌తో పాటు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకుగానూ 40 స్థానాల్లో బీజేపీ గెలుచుకుంది. 10 సీట్లు గెలుచుకున్న జేజేపీతో కలిసి హర్యానాలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో కాంగ్రెస్‌కు 31 సీట్లు వచ్చాయి. అయితే బీజేపీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం నుంచి జేజేపీ కొన్ని నెలల క్రితమే బయటికి వచ్చింది. ఈ పరిణామం కాంగ్రెస్‌కు కలిసొస్తుందని భావిస్తున్నారు.