Ramesh Bidhuri : పార్లమెంట్ స్పెషల్ సెషన్ సందర్భంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై ఇష్టానుసారంగా నోరుపారేసుకున్న బీజేపీ ఎంపీ రమేష్ బిధూరికి ప్రమోషన్ వచ్చింది. ఆయనను రాజస్ధాన్‌లోని టోంక్ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా బీజేపీ అధిష్టానం నియమించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ బరిలోకి దిగనున్నారు. ఇంతటి కీలకమైన స్థానంలో బీజేపీ వ్యవహారాలను నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్ హోదాలో రమేష్ బిధూరి పర్యవేక్షించనున్నారు.
Also read : Raviteja : సంక్రాంతి బరిలో ‘ఈగల్’ ..
అసలేం జరిగింది ?
బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరి ఈనెల 22న లోక్‌సభలో మాట్లాడుతూ.. బీఎస్‌పీ ఎంపీ దనీష్ అలీని ఉగ్రవాది అని సంబోధించారు. దీంతో అలజడి చెలరేగింది. వెంటనే దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్రమత్తమైన ప్రభుత్వం లోక్ సభ రికార్డుల నుంచి ఆ వీడియోను తొలగించింది. రమేశ్ బిదూరి చేసిన ఆరోపణలపై ఆ రోజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్‌పై మాట్లాడే క్రమంలో రమేశ్ బిదూరి ఈవిధంగా నోరు జారారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం అని ఓం బిర్లా వార్నింగ్ ఇచ్చారు. పదేపదే ఓ ముస్లిం ఎంపీపై అనుచిత పదజాలం వినియోగించడాన్ని లోక్ సభ స్పీకర్ తప్పుబట్టారు. దనీష్ అలీ ఈ వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పార్లమెంట్ సాక్షిగా తనను అవమానపరిచారని పేర్కొంటూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.