Voter Adhikar Yatra : బీజేపీ ఓట్లను అక్రమంగా దోచుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ‘ఓటర్ అధికార్ యాత్ర’ పేరుతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రారంభించిన పాదయాత్రలో భాగంగా ఆయన ఈ రోజు సీతామఢిలో మాట్లాడారు. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని వాడుకొని ప్రజల ఓటు హక్కును కాలరాస్తోంది. ఇది కేవలం ఓటింగ్ ప్రాసెస్‌ను చెక్కుమణిపెట్టడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేయడమే అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయని ఈ చర్యలు పక్కా ప్రణాళిక కింద జరుగుతున్నట్లు ఆరోపించారు.
Read Also: AP : ఏపీలో విస్తారంగా వర్షాలు..పరిస్థితిపై హోంమంత్రి అనిత సమీక్ష
ఈ తొలగింపుల్లో అత్యధికంగా దళితులు, గిరిజనులు, ఇతర సామాజికంగా బలహీన వర్గాలవారు ఉన్నారు. ఇవి యాదృచ్ఛికంగా జరిగాయంటే నమ్మశక్యం కాదు. ఇది ఓట్ల దొంగతనం. ప్రజల హక్కులను దారుణంగా పక్కదారి పట్టించడం” అని ఆయన మండిపడ్డారు. బిహార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్ గాంధీ, “బీజేపీ అనేది ‘ఓట్ చోర్’ పార్టీ. ఇది అధికారాన్ని తమ వద్ద నిలుపుకునేందుకు ప్రజల నమ్మకాన్ని మోసం చేస్తోంది. కానీ బిహార్ ప్రజలు, తమ ఓటు హక్కును ఈ విధంగా అపహరించుకోవడానికి ఒప్పుకోరు అని అన్నారు. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సీతాదేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమంలో యువత, మహిళలు, రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల చేత మద్దతుతో ఏర్పడలేదు. ఇది కూడా ఓట్ల దొంగతనమే. ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ నేతలు ఎన్నికలను ప్రభావితం చేసేందుకు వ్యవస్థలన్నింటినీ వాడుకుంటున్నారు అని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం ప్రజల ఓటు హక్కును అణగదొక్కుతున్నారని ఇది దేశానికి ముప్పుగా మారుతోందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆధారాలతో సహా ఈ కుట్రను బహిర్గతం చేస్తాం అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆగస్టు 17న ప్రారంభమైన ఈ ‘ఓటర్ అధికార్ యాత్ర’ మొత్తం 1300 కిలోమీటర్ల పాదయాత్రగా 16 రోజులపాటు కొనసాగనుంది. ఈ పాదయాత్ర ద్వారా బిహార్ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోని గ్రామాల వరకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, అలాగే ఎన్నికల విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. యాత్ర ముగింపు వేడుకలు సెప్టెంబర్ 1న పట్నాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభతో జరగనున్నాయి. దీనికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశముంది.
Read Also: Telangana : కుండపోత వర్షాలు..వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు