CEC – Bill Passed : సీఈసీ, ఈసీ ఎంపికలో ఇక సీజేఐ ఉండరు.. బిల్లుకు లోక్‌సభ ఆమోదం

CEC - Bill Passed : అత్యంత వివాదాస్పదంగా మారిన ‘ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక షరతులు, పదవీకాలం బిల్లు-2023’ను  గురువారం మధ్యాహ్నం లోక్‌సభ కూడా ఆమోదించింది. 

  • Written By:
  • Updated On - December 21, 2023 / 02:58 PM IST

CEC – Bill Passed : అత్యంత వివాదాస్పదంగా మారిన ‘ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇద్దరు కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక షరతులు, పదవీకాలం బిల్లు-2023’ను  గురువారం మధ్యాహ్నం లోక్‌సభ కూడా ఆమోదించింది.  పార్లమెంటు శీతాకాల సెషన్ ప్రారంభమైన వెంటనే ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాలు వాకౌట్ చేసినా.. దీన్ని అప్పట్లో రాజ్యసభ అప్రూవ్ చేసింది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)లోని ముగ్గురు సభ్యుల నియామకానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్ ఎన్నికల కమిషన్‌‌లోని సభ్యులను ఎంపిక చేయాలంటూ ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మార్గదర్శకాలను జారీ చేసింది. వాటికి పూర్తి విరుద్ధంగా ఈ బిల్లులోని నిబంధనలు ఉండటంతో వివాదాస్పదంగా మారింది. అయితే భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)లో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు కేంద్ర ఎన్నికల కమిషనర్ల  నియామక ప్రక్రియ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పిస్తూ(CEC – Bill Passed) కొత్త బిల్లులో నిబంధనలు చేర్చారు.

We’re now on WhatsApp. Click to Join.

కేంద్ర ఎన్నికల కమిషనర్లు (CEC), ఎన్నికల కమిషనర్లు (EC) వారివారి  పదవీ కాలంలో తీసుకున్న అధికారిక చర్యలు, నిర్ణయాలను చట్టపరమైన చర్యల నుంచి రక్షించే నిబంధనలు ఈ సవరణ బిల్లులో చేర్చారు. పదవీ కాలంలో వీరు చేపట్టిన చర్యలకు సివిల్ లేదా క్రిమినల్ కేసుల నుంచి  రక్షణ కల్పించే నిబందనలు కూడా ఉన్నాయి.  సీఈసీలు, ఈసీలు పదవిలో ఉన్నప్పుడు లేదా పదవి నుంచి వైదొలగిన తర్వాత వారికి వ్యతిరేకంగా ఏవైనా అభియోగాలు వచ్చినా సివిల్ లేదా క్రిమినల్ కేసులను నమోదు చేయడానికి వీలు ఉండదు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా సీఈసీ, ఈసీల హోదా ఉండగా.. కొత్త బిల్లులో దాన్ని మార్చారు. సీఈసీ, ఈసీలకు కేంద్ర కేబినెట్‌ సెక్రటరీలతో సమానమైన హోదాను ఇస్తామని కొత్త బిల్లులో ప్రతిపాదించారు. ఈ మార్పును విపక్ష నేతలు, కొందరు మాజీ సీఈసీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయం ఎన్నికల సంఘం స్వతంత్రతను దెబ్బతీస్తుందని ఆరోపించారు.

Also Read: CISF – Parliament : పార్ల‌మెంట్ భ‌ద్ర‌త బాధ్యత సీఐఎస్ఎఫ్‌కు

‘‘సీఈసీ, ఇతర కమిషనర్లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా వేతనాలు చెల్లించాలి’’ అనే కీలక నిబంధన కూడా కొత్త బిల్లులో ఉంది.  వాస్తవానికి ‘ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక షరతులు, పదవీకాలం బిల్లు-2023’ను  ఈ ఏడాది ఆగస్టులోనే రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. అప్పుడు దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. ఆ తర్వాత సెప్టెంబరులో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో బిల్లును తీసుకురావాలని భావించినా.. అది సాధ్యపడలేదు. ఎట్టకేలకు ఇప్పటికి రాజ్యసభ, లోక్‌సభల ఆమోదాన్ని ఈ బిల్లు పొందింది.