Site icon HashtagU Telugu

Bilkis Bano Case : ఆదివారంలోగా లొంగిపోండి.. బిల్కిస్ బానో కేసు దోషులకు ‘సుప్రీం’ ఆర్డర్

Bilkis Bano Case

Bilkis Bano Case

Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు మరో కీలక ఆదేశం జారీ చేసింది. జైలు అధికారుల ఎదుట లొంగిపోయేందుకు తమకు టైం కావాలంటూ 11 మంది దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆదివారంలోగా జైలు అధికారుల ఎదుట సరెండర్ కావాలని వారిని ఆదేశించింది. జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆర్డర్స్ జారీ చేసింది. రెండు వారాల్లోగా లొంగిపోవాలని జనవరి 8న తాము ఇచ్చిన ఆదేశాలను మార్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇంకా గడువు ఇవ్వలేమని స్పష్టం చేసింది. సరెండర్ కావడానికి మరింత టైం కావాలని దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ సమంజసంగా లేదని, అందులో ప్రస్తావించిన కారణాలు సరైనవి కావని తేల్చి చెప్పింది.  అనారోగ్యం, శీతాకాలపు పంటల సాగు, కొడుకు పెళ్లి వంటివి  సరైన కారణాలు కానే కావని సుప్రీం ధర్మాసనం(Bilkis Bano Case) అభిప్రాయపడింది.

We’re now on WhatsApp. Click to Join.

2002 ఫిబ్రవరిలో గోద్రా రైలు దహనం ఘటన తర్వాత గుజరాత్‌లో మతపరమైన అల్లర్లు జరిగాయి. ఆ టైంలో  బిల్కిస్ బానో వయసు 21 ఏళ్లు. ఆమె ఐదు నెలల గర్భిణి.  11 మంది దుండగులు వారి ఇంటిపై దాడి చేశారు. బిల్కిస్‌పై సామూహిక అత్యాచారం  చేశారు. ఏడుగురు బిల్కిస్ బానో కుటుంబ సభ్యులను హత్య చేశారు. వారిలో బిల్కిస్ మూడేళ్ళ కుమార్తె కూడా ఉన్నారు. ఈ కేసులో 11 మందికి 2008లోనే జీవితఖైదు శిక్షపడింది. అయితే 2022 సంవత్సరంలో ఆగస్టు 15న గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం వారందరికీ క్షమాభిక్ష ప్రసాదించి.. గంపగుత్తగా జైలు నుంచి రిలీజ్ చేసింది. దీనిపై బిల్కిన్ బానో సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ వేయగా.. 2024 జనవరి 8న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్నది తప్పుడు నిర్ణయమని న్యాయస్థానం వెల్లడించింది. క్షమాభిక్షతో విడుదలైన 11 మంది దోషులంతా వెంటనే జైలులో లొంగిపోవాలని ఆదేశించింది. దీనిపై 251 పేజీల తీర్పును వెలువరించింది. అయితే ఆ దోషులంతా వివిధ సాకులను చూపుతూ.. జైలులో సరెండర్ కావడానికి మరింత టైం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. తాజాగా ఇవాళ దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం, వారి అప్పీల్‌ను తిరస్కరించింది. జైలు విడుదలైన 11 మంది దోషులలో.. బకాభాయ్ వోహానియా, బిపిన్ చంద్ర జోషి, కేసర్‌భాయ్ వోహానియా, గోవింద్ నాయ్, జస్వంత్ నై, మితేష్ భట్, ప్రదీప్ మోర్ధియా, రాధేశ్యామ్ షా, రాజుభాయ్ సోనీ, రమేష్ చందన, శైలేష్ భట్ ఉన్నారు.

Also Read: Free Maternity Care : ఆ ఆస్పత్రిలో ఫ్రీ డెలివరీ.. రామమందిర ప్రారంభోత్సవ వేళ సేవాభావం