Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో సంచలన తీర్పు.. 11 మంది దోషుల విడుదల చెల్లదు

Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సోమవారం ఉదయం కీలక ఆదేశాలు జారీ చేసింది.

  • Written By:
  • Updated On - January 8, 2024 / 12:33 PM IST

Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సోమవారం ఉదయం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2002 సంవత్సరంలో జరిగిన గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి ఆమె కుటుంబాన్ని హతమార్చిన 11 మంది దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం రెండేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.  అత్యాచారం, హత్య కేసుల్లో దోషులుగా తేలిన 11 మందిని గుజరాత్ సర్కారు 2022 సంవత్సరంలో విడుదల చేయడాన్ని  సవాల్ చేస్తూ బిల్కిస్ బానో వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బి.వి. నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం సమర్ధించింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ మహారాష్ట్రలో జరిగినందున ఆ 11 మంది దోషుల విడుదల ఆర్డర్‌ను ఆమోదించే హక్కు గుజరాత్ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ‘‘నేరస్థులను విచారించిన రాష్ట్రం(మహారాష్ట్ర) మాత్రమే వారి విడుదలపై నిర్ణయం తీసుకోగలదు’’ అని సుప్రీంకోర్టు తెలిపింది. రెండు వారాల్లోగా 11 మంది దోషులు పోలీసులకు లొంగిపోవాలని సుప్రీంకోర్టు(Bilkis Bano Case) ఆదేశించింది.

 We’re now on WhatsApp. Click to Join.

ఈ తీర్పు ఇచ్చే క్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పర్యవసానాల అలజడులను పట్టించుకోకుండా చట్టబద్ధమైన పాలనను మనం కాపాడుకోవాలి. బాధితురాలి హక్కులను పరిరక్షించడం ముఖ్యం. మహిళలకు గౌరవం దక్కి తీరాలి. ఒక మహిళ సమాజంలో ఏ స్థితిలో జీవిస్తున్నా.. గౌరవింపబడాలి. ఒక మహిళ ఏ మతానికి చెందినదైనా.. గౌరవం  పొందాలి. మహిళలపై జరిగిన క్రూరమైన నేరాలలో పాల్గొన్న వారికి  ఉపశమనం ఇవ్వాలనే ఆలోచన సరికాదు’’ అని జస్టిస్ నాగరత్న కామెంట్ చేశారు. 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం ఎదుట ముందస్తు ఉపశమనం కోసం అప్పీల్ చేసుకోవడానికి అనుమతిస్తూ 2022 మేలో నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి (రిటైర్డ్) ఇచ్చిన తీర్పును కూడా ధర్మాసనం తప్పుపట్టింది. 2002 గుజరాత్ అల్లర్ల టైంలో బిల్కిస్ బానోతో, ఆమె కుటుంబంతో  చేసిన దారుణాల  వాస్తవాలను దాస్తూ.. జైలు నుంచి విడుదలను కోరుతూ మోసపూరిత మార్గంలో 11 మంది దోషులు  ఆనాడు గుజరాత్ సర్కారుకు  దరఖాస్తు చేసుకున్నారని సుప్రీంకోర్టు తెలిపింది.

Also Read: Sriram Akhand Jyoti : అయోధ్య రామమందిరంలో అఖండ జ్యోతి.. విశేషాలివీ..

2022లో స్వాతంత్ర్య దినోత్సవం రోజున గుజరాత్ ప్రభుత్వం 11 మంది బిల్కిస్ బానో కేసులోని దోషులకు క్షమాభిక్ష  ప్రసాదించి విడుదల చేసింది. వీరి విడుదలపై సిఫారసు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం అప్పట్లో నియమించిన కమిటీ దోషులకు అనుకూలంగా నివేదిక ఇచ్చింది. ‘‘ఇప్పటికే 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన 11 మంది ఖైదీలు  సత్ప్రవర్తనను ప్రదర్శిస్తున్నారు. వారంతా సంస్కారవంతుల్లాగా ప్రవర్తిస్తున్నారు’’ అని ఆ నివేదికలో తెలిపింది. దీంతో గుజరాత్ సర్కారు ఆ 11 మందిని జైలు నుంచి రిలీజ్ చేసింది. జైలు నుంచి విడుదలయ్యాక.. 11 మంది దోషులకు పెద్దఎత్తున పూలదండలు, మిఠాయిలతో స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.