Thackerays Reunion: బాల్‌థాక్రే కుటుంబం మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా ఫేమస్. గత 20 ఏళ్లుగా విడిపోయి రాజకీయాలు చేస్తున్న ఈఫ్యామిలీ.. మళ్లీ కలుస్తుందనే ప్రచారం మొదలైంది. కుటుంబ విబేధాల కన్నా మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాక్రే వేర్వేరు సందర్భాల్లో అన్నారు. అకస్మాత్తుగా వారి స్వరంలో ఈ మార్పు ఎందుకు వచ్చింది ? నిజంగా ఇరుపార్టీలు తిరిగి విలీనం కాబోతున్నాయా ? అనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది.
మా గొడవల కంటే మహారాష్ట్ర పెద్దది : రాజ్ థాక్రే
తనకు, ఉద్ధవ్‌కు మధ్యనున్న గొడవలు చిన్నవేనని ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాక్రే అన్నారు. తమ ఇద్దరి గొడవల కంటే మహారాష్ట్ర చాలా పెద్దదన్నారు. తమ ఇద్దరి విభేదాలు మహారాష్ట్ర, మరాఠీ ప్రజల మనుగడకు అడ్డంకిగా మారుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అవసరమైతే తామిద్దరం తిరిగి చేతులు కలపడం అనేది కష్టమైన పనేం కాదన్నారు. మరాఠీ ప్రజలంతా ఏకమై ఒకే పార్టీని ఏర్పాటు చేయాలని రాజ్ థాక్రే పిలుపునిచ్చారు. ఒకవేళ ఆ దిశగా ప్రయత్నాలు జరిగితే, తన అహాన్ని అడ్డు రానివ్వనని ఆయన తేల్చి చెప్పారు.
Also Read :Senior Citizen Card : సీనియర్ సిటిజన్ కార్డ్.. అప్లై చేసుకుంటే ప్రయోజనాలివీ
చిన్నచిన్న వివాదాలను పక్కన పెట్టడానికి రెడీ : ఉద్ధవ్ థాక్రే
మహారాష్ట్ర ప్రయోజనాల కోసం మరాఠీ ప్రజలంతా ఏకం కావాలని ఉద్ధవ్ థాక్రే(Thackerays Reunion) పిలుపునిచ్చారు. చిన్నచిన్న వివాదాలను పక్కన పెట్టడానికి తాను రెడీ అని ఆయన తేల్చి చెప్పారు. మహారాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తులను తాను స్వాగతించబోనని ఉద్ధవ్ స్పష్టం చేశారు. దీనిపై క్లారిటీకి వచ్చాకే తాను కలిసి పనిచేస్తానన్నారు. ‘‘పరిశ్రమలను మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు తరలిస్తున్నారని పార్లమెంటులో మేం ఎత్తిచూపినప్పుడు.. మనం ఐక్యంగా ఉంటే, మహారాష్ట్ర కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవాళ్లం. ఒక రోజు వారికి మద్దతివ్వడం, మరుసటి రోజు వ్యతిరేకించడం, ఆ తర్వాత మళ్లీ రాజీపడటం వంటివి సరికాదు’’ అని ఉద్ధవ్ థాక్రే చెప్పుకొచ్చారు.